జీహెచ్ఎంసీలో విలీనంపై భగ్గుమంటున్న బడంగ్ పేట్ వాసులు

జీహెచ్ఎంసీలో విలీనంపై భగ్గుమంటున్న బడంగ్ పేట్ వాసులు
x
Highlights

బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్..నగర శివారు ప్రాంతాల్లో ఒకటైన ఈ ప్రాంతాన్ని తాజాగా జీ హెచ్ ఎం సీ లో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది....

బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్..నగర శివారు ప్రాంతాల్లో ఒకటైన ఈ ప్రాంతాన్ని తాజాగా జీ హెచ్ ఎం సీ లో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే...బడంగ్ పేట్ కార్పొరేషన్ ను చార్మినార్ జోన్ లో కలపడం పై ఆ ప్రాంతవాసులు భగ్గుమంటున్నారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. చార్మినార్ జోన్ లో ఆ కార్పొరేషన్ ను కలపడం పై స్థానికుల్లో ఉన్న ఆందోళనలు, అభ్యంతరాలు ఏంటి..?? ఇంతకీ జీ హెచ్ ఎం సీ లో విలీనం పై బడంగ్ పేట్ వాసులు ఏమంటున్నారు...?

బడంగ్‌పేట్‌.. మొదట గ్రామ పంచాయతీ గా తరువాత అల్మాస్ గూడ , గుర్రం గూడ , నాదర్ గుల్ , బడంగ్ పేట్, బాలాపూర్, మల్లాపూర్, సుల్తాన్ పూర్, మామిడి పల్లి లాంటి 8 గ్రామాలను విలీనం చేయడం ద్వారా 2013 మార్చి 26 న నగర పంచాయతీ గా ఏర్పాటు చేశారు. ఇక తరువాత 2019 నగర పంచాయతీని కాస్తా మునిసిపల్ కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేశారు. ఈ కార్పోరేషన్ లో 1 లక్షా 30 వేల ఓటర్లు ఉన్నారు. ఈ కార్పోరేషన్ లో నాదర్ గుల్ ఎక్కువ రెవెన్యూ వచ్చే ప్రాంతాల్లో ఒకటి.

బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్..సిటీ కి దూరంగా ప్రశాంతంగా ఉండాలనుకునే వాళ్ళు..మధ్యతరగతి ప్రజలు ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇక ఐటీ ఉద్యోగులు కూడా ఈ ప్రాంతం లో నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపుతుండటం తో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పుంజుకుంది.

నగర పంచాయతీ నుండి కార్పోరేషన్ గా ఈ ప్రాంతం అప్ గ్రేడ్ అయినా ఇప్పటికీ ఇక్కడ మాత్రం ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు అనేకంగా ఉన్నాయి. ఇక్కడ గతంలో 27 వరకు చెరువులు ఉండగా ఇప్పుడు తొమ్మిది వరకు మాత్రమే మిగిలి ఉన్నాయి . అన్నీ ఆక్రమణలకు గురై పూర్తిగా కనుమరుగయ్యాయి. కనీసం ఉన్న చెరువులను అయినా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఇక బడంగ్‌పేట్‌ దేవతల గుట్ట దాదాపుగా కబ్జా కు గురైందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడ గుట్టను ధ్వంసం చేస్తూ నిర్మాణాలు చేస్తున్నారని స్థానికుల ఆరోపణ.

ఇక ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అత్యంత దారుణంగా తయారయింది. అల్మాస్ గూడ గృహకల్ప వద్ద దాదాపు ఆరు నెలలుగా డ్రైనేజీ పొంగిపొర్లుతున్నా పట్టించుకున్న వారే లేరు. ఇక ఇక్కడ అంతర్గత రహదారుల. పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా తయారయ్యింది. ఎటు చూసినా గుంతల మయమైన రహదారులే దర్శనమిస్తాయి. ఎన్ని సార్లు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా పరిస్థితి లో మాత్రం మార్పులేదు.

ఇక తాజాగా బడంగ్‌పేట్‌ కార్పోరేషన్ ను ప్రభుత్వం జీ హెచ్ ఎం సీ లో విలీనం చేసింది. బడంగ్‌పేట్‌, నాదర్ గుల్, బాలా పూర్ డివిజన్లుగా విభజించి ఈ మూడింటినీ చార్మినార్ జోన్ లో కలిపారు . అయితే ప్రభుత్వ నిర్ణయం పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విలీనాన్ని నిరసిస్తూ బీజేపీ వంటి పార్టీలు మరియు స్థానిక ప్రజలు నిరసనలు చేపట్టారు, బడంగ్‌పేట్ బచావో పేరిట వరుస ఆందోళనలు స్థానికులు కొనసాగిస్తున్నారు. జీ హెచ్ ఎం సీ లో మున్సిపాలిటీలు ,కార్పొరేషన్ల విలీన ప్రక్రియ శాస్త్రీయంగా సాగలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేవలం రాజకీయంగా లబ్ధి పొందడానికే అధికార కాంగ్రెస్ పార్టీ తమ ప్రాంతాన్ని చార్మినార్ జోన్ లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారని ఇది ఓట్ల కోసం ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి చేసిన కుట్ర అని ప్రతిపక్షాలు ముఖ్యంగా స్థానిక బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

బడంగ్‌పేట్‌ను ఎల్బీనగర్ జోన్‌లోనే ఉంచాలని లేదా మీర్‌పేట్, జల్ పల్లి ,తుక్కుగూడ వంటి ప్రాంతాలతో కలిసి ఒక ప్రత్యేక జోన్‌గా ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. తమ ప్రాంతంలో ఎక్కువగా పేద ,మధ్యతరగతి ప్రజలు ఉంటారని వాళ్ళు తమ పనులకోసం చార్మినార్ వరకు వెళ్ళడం ఇబ్బంది అని...పక్కనే ఉన్న ఎల్ బి నగర్ కాకుండా చార్మినార్ జోన్ లో కలపడం ఇక్కడి ప్రజలకు తీవ్ర నష్టం చేయడమే అని వారు విమర్శిస్తున్నారు.

ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం ఉండేలా విలీన ప్రక్రియను చేయాల్సి ఉండగా దానికి పూర్తిగా వ్యతిరేకంగా చేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories