Telangana Panchayat Elections: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి షాక్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఊహించని ఫలితాలు

Telangana Panchayat Elections: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి షాక్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఊహించని ఫలితాలు
x

 Telangana Panchayat Elections: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి షాక్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఊహించని ఫలితాలు

Highlights

బీజేపీలో కొందరు లీడర్లకు బలపరీక్షలా పంచాయతీ ఎన్నికలు కారు దిగి కమలం చెంతన చేరిన నేతలకు ఆదిలోనే షాక్ మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి అధ్వాన్నంగా మారిందనే చర్చ అచ్చంపేట, వర్ధన్నపేటలో సింగిల్ డిజిట్ దాటని బీజేపీ

అసెంబ్లీ ఎన్నికల అనంతరం..కారు దిగి కాషాయ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయా..? గ్రామస్థాయిలో వారి బలం ఏంటో..సత్తా ఏంటో బయటపడిందా..? సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళు ఎందుకు విఫలమయ్యారు..? కొత్త, పాత నేతల మధ్య కొట్లాటలు, కుమ్ములాటలే ఆ నియోజకవర్గాల్లోని పంచాయతీ పోరులో ఓటమికి ప్రధాన కారణమా..? లేదంటే ఆ నేతలే ఎన్నికలను లైట్ తీసుకున్నారా..? నేతలు పార్టీ మారినా, క్యాడర్ మారలేదా..? లేదా గ్రౌండ్ లెవెల్‌లో పూర్తిగా పట్టు కోల్పోయారా..? ఇంతకీ ఆ మాజీ ఎమ్మెల్యేలు ఎవరు?


గ్రామ పంచాయతీ ఎన్నికలు కమలం పార్టీలో కొందరు లీడర్లకు బల పరీక్షలా మారాయట. నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా చెప్పుకునే కాషాయ నేతలు.. పెద్దగా ప్రభావం చూపించలేకపోవడం వారికి సవాల్‌‌గా మారిందట. ముక్యంగా అసెంబ్లీ ఎన్నికల అనంతరం కారు దిగి కమలం చెంతన చేరిన నేతలకు.. గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు ఆదిలోనే షాక్ ఇచ్చాయట. దీంతో బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి ఊహించని విధంగా, అధ్వాన్నంగా మారిందనే చర్చ జోరుగా సాగుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో పార్టీ శ్రేణుల్లోనూ ఇదే చర్చ మొదలైంది.


అచ్చంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో సింగిల్ డిజిట్ దాటలేకపోగా….. హుజూర్‌నగర్‌లో అయితే అసలు ఖాతా కూడా తెరవలేక బీజేపీ డకౌట్ అయ్యింది. దీంతో కొత్తగా వచ్చిన నేతల రాజకీయ బలం, కేడర్‌ తో ఆ నేతలకు ఉన్న పట్టుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే కొత్త, పాత అంటూ నేతల మధ్య కొట్లాటలు, అంతర్గత పోరుతో సమన్వయం లేకపోవడం సైతం ఓ కారణం అంటూ మరో చర్చ పార్టీలో జరుగుతోంది. వీరి రాకతో నియోజకవర్గాల్లో పార్టీ బలపడుతుంది అనుకున్నట్టే.. ఈ పేలవ ప్రదర్శన ఏంటన్న తెరపైకి వస్తుందట. గ్రౌండ్ లెవెల్‌లో పట్టులేని నేతలపై అధిష్ఠానం అసంతృప్తిగా ఉన్నట్టు పార్టీలో చర్చనీయాంశమైంది.


స్తానిక సంస్థల ఎన్నికల్లో వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో బిజెపికి చుక్కెదురైంది. బిజెపి ఎక్కడా నామమాత్రంగా కూడా పోటీలో కనబడలేదు. నియోజకవర్గంలో 83గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం 4 సర్పంచ్‌ స్తానాల్లో మాత్రమే బిజెపి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. దీంతో గ్రామస్థాయిలో నాయకత్వ ప్రభావం ఎంత బలహీనంగా ఉందో ఈ ఫలితాలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. వర్ధన్నపేటలో బీఆర్ఎస్ నుండి 2సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆరూరి రాకతో బిజెపి మరింత బలపడుతుందనుకున్న రాష్ట్ర నాయకత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో ఆయన బలం ఎంత అనేది స్పష్టమైందట. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఆరూరి.. కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు చేతిలో ఓడిపోయారు. తదనాంతరం బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి వరంగల్ ఎంపీగా పోటీ చేసి కడియం కావ్య చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి బీజేపీలో అంతా చురుకుగా ఉండకపోవడం, తన వెంట వచ్చిన కార్యకర్తలను భుజం తట్టి నడిపించకపోవడం, పూర్తిగా బీఆర్ఎస్ క్యాడర్ తన వెంట రాకపోవడం, పాత బీజేపీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేయడంలో పూర్తిగా విఫలం కావడంతో పంచాయతీ పోరులో పార్టీ అభ్యర్థుల గెలుపుపై ప్రభావం పడిందని ఒక వైపు పార్టీ నేతలు, మరోవైపు ఓడిన అభ్యర్థులు సైతం ఆరోపణలు గుప్పిస్తున్నారు.


అచ్చంపేట నియోజకవర్గం అంటేనే ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఉదాంతం గుర్తుకొస్తుంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు,శాశ్వత శత్రువులు ఉండరు అనే నానుడికి ఇది సరిగ్గా సరిపోతుంది. ఆనాడు ఎమ్మెల్యేల కొనుగోలు ఇష్యూలో ప్రధాన వ్యక్తే గువ్వల బాలరాజు. ఆనాడు బీజేపీ పార్టీని, అదే విధంగా అగ్రనేత బీఎల్ సంతోష్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా గువ్వల బాలరాజు నిలిచిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమితో పాటు.. పార్టీ ఓడిపోవడం, లోక్‌సభ లోనూ కారు పార్టీకి సున్నా ఫలితాలు, దానికి తోడు బీఆర్ఎస్ లోని అంతర్గత విభేదాల కారణంగా ఇటీవలే బీజేపీలో చేరారు. బీజేపీ మతతత్వ పార్టీ అని ఆనాడు తిట్టి ఇప్పుడు అదే బీజేపీలో చేరడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ పూర్తిగా తన వెంట రాకపోవడం మైనస్ అయితే, అదే పాత బీజేపీ క్యాడర్ పూర్తిగా సహకారం లేకపోవడం, ఇరువర్గాలను గువ్వల సమన్వయం చేయలేదనే అపవాదు ఉంది‌. అచ్చంపేటలో ఇదే పార్టీకి పెద్ద మైనస్‌గా మారిందట. అచ్చంపేట నియోజకవర్గంలోని 178 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరిగితే… బీజేపీ గెలుచుకున్న స్థానాలు కేవలం రెండు మాత్రమే.సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోవడం పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది.


మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ .. ఈ నియోజకవర్గంలో 124 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగగా… బీజేపీ ఒక్క సర్పంచ్ స్థానం కూడా గెలవలేక చతికిల పడింది. ఖాతా తెరవకపోవడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఉప ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండటం... అదే తిరిగి మళ్ళీ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం అనూహ్యంగా 2024లో ఢిల్లీ వేదికగా బీజేపీ పార్టీలో చేరి 2024 లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారట..ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో తన క్యాడర్న్ ఉత్తేజపరిచి పాత బీజేపీ నేతలను కలుపుకొని పోవడంలో ఫెయిల్ అయినట్టు పంచాయితీ ఫలితాలు చూస్తేనే అర్థమవుతుంది.


ఉన్నది కాస్త ఊడింది....సర్వమంగళం పాడింది అన్నట్టే తయారైందని బీఆర్‌ఎస్‌ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరినందుకే ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు ఈ దుస్థితి వచ్చిందంటూ బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన ఆరూరి రమేష్, గువ్వల బాలరాజు, సైదిరెడ్డి నియోజకవర్గాల్లో బీజేపీకి షాక్ తగలడం రాజకీయంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఇటు సొంత పార్టీ బీజేపీలో సైతం ముగ్గురు నేతల పనితీరుపై గుసగుసలాడుకుంటున్నారు. ఈ ఫలితాల ప్రభావం వచ్చే ఎన్నికలపై పడుతుందా అనే భిన్నాభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. పార్టీ గుర్తు కాదు కాబట్టి గ్రామాల్లో ఉన్న పరిస్థితులు,ప్రజా సమస్యలు, కుల సమీకరణాల దృష్ట్యా జరిగిన ఎన్నికలు కాబట్టి మాజీ ఎమ్మెల్యేల ప్రభావం ఏ మాత్రం లేదని మరోవైపు చర్చ జరుగుతోంది.


మొత్తంగా చూస్తే… బీజేపీలోకి వచ్చిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల ప్రభావం గ్రామస్థాయిలో పనిచేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీలోకి వచ్చిన కొత్త నేతలకు పంచాయితీ ఎన్నికల ఫలితాలు కఠినమైన పాఠం నేర్పినట్టైంది. ఇకపై బీజేపీ అధిష్ఠానం ఈ నేతలను పిలిచి జరిగిన లోటుపాట్లపై చర్చించి... తిరిగి ఆ పొరపాట్లు పునరావృతం కాకుండా దిశానిర్దేశం చేసి.. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వారిని సన్నద్ధం చేస్తుందో...? లేదో ? వేచి చూడాల్సిందే....

Show Full Article
Print Article
Next Story
More Stories