డీసీసీ ప్రెసిడెంట్ల ఎంపికపై కాంగ్రెస్‌లో అంతర్గత చర్చలు!


డీసీసీ ప్రెసిడెంట్ల ఎంపికపై కాంగ్రెస్‌లో అంతర్గత చర్చలు!
తెలంగాణలో హస్తం నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న డీసీసీ ప్రెసిడెంట్‌ల నియామకం పూర్తైంది. రెండు జిల్లాలు మినహా గంపగుత్తగా అధ్యక్షుల ప్రకటన వచ్చేసింది.
తెలంగాణలో హస్తం నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న డీసీసీ ప్రెసిడెంట్‌ల నియామకం పూర్తైంది. రెండు జిల్లాలు మినహా గంపగుత్తగా అధ్యక్షుల ప్రకటన వచ్చేసింది. దరఖాస్తుల స్వీకరణ నుంచి మొదలు హైకమాండ్ పరిశీలకుల అభిప్రాయ సేకరణ, వడపోతలు, తెరవెనక మంత్రంగాలు, ఢిల్లీలో పైరవీలు ఇలా అనేక ప్రక్రియల అనంతరం ఫైనల్ లిస్టు విడుదలైంది. మరి జిల్లా పార్టీ సారథుల ఎంపికలో సామాజిక న్యాయం జరిగిందా..? నేతల ఏకాభిప్రాయంతోనే
పగ్గాలు అప్పగిస్తున్నారా..? ఏ ప్రాతిపదికన డీసీసీ ప్రెసిడెంట్‌ల నియామకం జరిగింది..? పదవి ఆశించి భంగపడ్డ నేతల సంగతి ఏంటి..? హైకమాండ్ నిర్ణయాన్ని శిరసావహించి జిల్లా అధ్యక్షులకు సహకరిస్తారా లేక.. అసమ్మతి గళం వినిపిస్తారా..?
జూబ్లీహిల్స్ బైపోల్ విజయంతో వచ్చిన జోష్.. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం.. దీంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇదే మంచి తరుణం అనుకుని రాష్ట్రంలో డీసీసీ ప్రెసిడెంట్‌ల నియామకాన్ని పూర్తి చేసింది హస్తం అధిష్టానం. ఎన్నో రోజుల ఎదురుచూపులు, ఉత్కంఠకు తెర దించుతూ జిల్లాలకు పార్టీ సారథులను ఫైనల్ చేసింది. సికింద్రాబాద్, ఖైరతాబాద్ సహా 33 జిల్లాలు, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ కార్పొరేషన్లకు కలిపి మొత్తం 36 మంది పేర్లను ప్రకటించింది. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఈ మేరకు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఈ నియమాకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు.
డీసీసీ ప్రెసిడెంట్‌ల నియామక ప్రక్రియను చాలా పకడ్బందీగా, సుదీర్ఘంగా చేపట్టింది హైకమాండ్. తొలుత అక్టోబర్ నెలలో జిల్లాలోని హస్తం ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఆ తర్వాత ప్రతి జిల్లాకు ఏఐసీసీ అబ్జర్వర్లను పంపించి వారిచ్చిన నివేదికతో వడపోత చేపట్టింది. జిల్లాకు ముగ్గురి చొప్పన ఆశావహుల ఎంపిక తదనంతరం సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జీల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని లిస్టును ఫైనల్ చేసింది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని భావిస్తున్న అధిష్టానం.. సమర్థులని భావించిన నేతలకు బాధ్యతలు అప్పగించింది. ఈ పదవిలో మూడేళ్లకు పైబడి పనిచేస్తున్నవారిని తిరిగి ఎంపిక చేయవద్దని ఏఐసీసీ నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నందున క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేసే నేతలను అన్ని కోణాల్లో పరిశీలించి ఎంపిక చేయాలని ఏఐసీసీ సూచించినట్లు నేతలు తెలిపారు. ఇందులో ఐదుగురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ ఒకరికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం కల్పించింది. అలాగే గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలకు చాన్స్ ఇచ్చింది.
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు యాదాద్రి భువనగిరి జిల్లా బాధ్యతలు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణకు నాగర్ కర్నూల్ జిల్లా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు నిర్మల్ జిల్లా, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌కు పెద్దపల్లి జిల్లా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు కరీంనగర్ జిల్లా బాధ్యతలు అప్పగించింది. అలాగే తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డికి వనపర్తి జిల్లా బాధ్యతలు ఇచ్చింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వజ్రేశ్ యాదవ్‌కు మేడ్చల్, ఎంపీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి ఓటమిపాలైన ఆత్రం సుగుణకు ఆసిఫాబాద్ జిల్లాలు అప్పగించింది. లకావత్ ధన్వంతికి జనగామ డీసీసీ చీఫ్‌గా అవకాశం కల్పించింది. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా, సికింద్రాబాద్ అధ్యక్షుడిగా కె.దీపక్ జాన్, ఖైరతాబాద్ అధ్యక్షుడిగా మోత రోహిత్ ముదిరాజ్‌ను నియమించింది. పున్న కైలాశ్‌కు నల్గొండ పగ్గాలు అప్పగించింది. వీరితో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్‌ను నియమించింది. మొత్తం 36 మంది డీసీసీ చీఫ్‌లలో ఐదుగురు మహిళలకు చోటు దక్కింది. వీరిలో ఆత్రం సుగుణ, తోట దేవి ప్రసన్న, లకావత్ ధన్వంతి, భూక్య ఉమ, తూముకుంట ఆంక్ష రెడ్డి ఉన్నారు. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల డీసీసీ అధ్యక్షులను పెండింగ్‌లో పెట్టింది. ఆ జిల్లా నేతల మధ్య నెలకొన్న విభేదాల కారణంగానే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
డీసీసీ ప్రెసిడెంట్ పదవుల కోసం ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ.. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసింది అధిష్టానం. అన్ని వర్గాలకు కమిటీల్లో ప్రాధాన్యత కల్పించింది. ముఖ్యంగా బీసీ నినాదాన్ని గట్టిగా వినిపిస్తోన్న హస్తం పార్టీ.. జిల్లా అధ్యక్షుల ఎంపికలో సామాజిక సమతుల్యతను పాటించింది. 14 డీసీసీలను బీసీలకు కట్టబెట్టింది. 9 మంది ఓసీలు, ఆరుగురు ఎస్టీలు, ఐదుగురు ఎస్సీలు, ఇద్దరు మైనారిటీలకు అవకాశం కల్పించింది.
గతంలో లాగా డమ్మీ పదవుల్లా కాకుండా.. డీసీసీ ప్రెసిడెంట్‌లకు విశేష అధికారాలు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది హైకమాండ్. జిల్లా మంత్రుల సూచనలను పాటిస్తూ.. లీడర్‌ను, కేడర్‌ను సమన్వయం చేస్తూ పార్టీ కార్యక్రమాలు చేపట్టడం. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను జనాల్లో విస్తతంగా ప్రచారం కల్పించేలా చేయడం. పార్టీ సభ్వత్వాల నమోదుతో పాటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికకూ డీసీసీ ప్రెసిడెంట్ల అభిప్రాయాలను కీలకం చేస్తూ హైకమాండ్ నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు తెలిసిన నేతలుగా.. డీసీసీ ప్రెసిడెంట్‌లకు పీసీసీ తరహాలో పవర్‌ఫుల్‌గా మార్చింది. దీంతో ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు సైతం.. పోటీ పడ్డారు.
కాంగ్రెస్ పార్టీలో.. రెడ్డి ప్రాభల్యం ఎక్కువ. పార్టీ పదవులన్నీ ఆ వర్గానికే అన్న అపవాదను తొలగిస్తూ ఈసారి సమర్థతతో పాటు.. అన్ని సమాజిక వర్గాల నేతలకు అవకాశం కల్పించింది. పదవుల కోసం కొంత మంది పోటీదారులు తమ పరపతితో ఢిల్లీ స్తాయిలో పైరవీలు,, మంత్రుల రికమండేషన్స్ చేసినా భంగపాటు తప్పలేదు. జిల్లా పరిస్థితులు, నేతల బలాబలాలను లెక్కలోకి తీసుకుని ఫైనల్ లిస్టును ఓకే చేసినట్టు తెలుస్తోంది. ఐతే కొన్ని జిల్లాల్లో అధ్యక్ష పదవి చేజారడంతో ఆశావహులు భంగపాటుకు గురైనట్టు తెలుస్తోంది. మరి వారి అసమ్మతిని చల్లార్చేందుకు పార్టీ ఏం చేయనుంది. కొత్త ప్రెసిడెంట్‌లకు సహకరించేలా ఒప్పించి దారికి తెచ్చుకుంటుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అధికార పార్టీ కాబట్టి అసంమ్మతి గళాలు పెద్దగా వినిపించే ఆస్కారం లేదు. ఐదైన ఉంటే అంతర్గతంగా పరిష్కరించేలా పార్టీ చర్యలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కొత్త డీసీసీ ప్రెసిడెంట్లను ఇప్పటి నుంచే కార్యక్షేత్రంలోకి దింపాలని చూస్తోంది. కేడర్‌ను ఏకతాటి పైకి తీసుకొచ్చి.. అందరూ సమన్వయంతో కలిసి పని చేసేలా వారికి దిశానిర్దేశం చేయనున్నారు. గ్రామ పంచాయతీలు, ఆ తర్వాత జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే లక్ష్యంతో.. అధిష్టానం పావులు కదుపుతోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



