Double Bedroom Houses : తెలంగాణ పేదలకు గృహ యోగం..ఆగిపోయిన డబుల్ బెడ్‌రూం ఇళ్లపై ప్రభుత్వం క్లారిటీ

Double Bedroom Houses : తెలంగాణ పేదలకు గృహ యోగం..ఆగిపోయిన డబుల్ బెడ్‌రూం ఇళ్లపై ప్రభుత్వం క్లారిటీ
x
Highlights

తెలంగాణ పేదలకు గృహ యోగం..ఆగిపోయిన డబుల్ బెడ్‌రూం ఇళ్లపై ప్రభుత్వం క్లారిటీ

Double Bedroom Houses : తెలంగాణలో సొంత ఇంటి కల కంటున్న నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలతో పాటు, కొత్తగా మంజూరు చేసే ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల వేళ మంత్రులు నిర్వహిస్తున్న ప్రచార పర్వంలో పేదల గృహ నిర్మాణ పథకాలపై వరాల జల్లు కురిపిస్తున్నారు.తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం కరీంనగర్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గంలో దాదాపు 600 ఇళ్లను పదేళ్లుగా మధ్యలోనే ఆపేశారని, వాటిని యుద్ధ ప్రాతిపదికన నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే తమ ప్రభుత్వం 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా వేగవంతం చేస్తామని ఆయన ప్రజలకు వివరించారు.

రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ప్రజాపాలన-ప్రగతి బాట సభలో మాట్లాడుతూ మరో శుభవార్త చెప్పారు. ఏప్రిల్ నెల నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావచ్చాయని, త్వరలోనే గృహప్రవేశాలు కూడా ఉంటాయని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో అర్హులైన ప్రతి పేదవాడికి విడతల వారీగా ఇళ్లను మంజూరు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

మున్సిపాలిటీల్లో నివసించే పేదల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక వినూత్న ప్రకటన చేశారు. పట్టణ ప్రాంతాల్లో సొంత స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్ల కింద ఆర్థిక సాయం అందిస్తామని, అసలు స్థలమే లేని నిరుపేదలకు ప్రభుత్వమే జీ ప్లస్ 2 తరహాలో అపార్ట్‌మెంట్లు నిర్మించి ఇస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 4 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోని పేదలపై దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా ఇళ్లను కేటాయిస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తుండగా, మంత్రులందరూ తమ తమ ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే పట్టణాలను మరింత అభివృద్ధి చేస్తామని, సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరుస్తామని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూనే, పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామన్న హామీ ఓటర్లను ఆకట్టుకునేలా కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories