
తెలంగాణకు కేంద్రం బంపర్ ఆఫర్.. ఫార్మర్ రిజిస్ట్రీతో రూ.424 కోట్ల కానుక
Central Funds : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. అన్నదాతల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కీలకమైన ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. నిర్దేశించిన లక్ష్యాన్ని అత్యంత వేగంగా, సమర్థవంతంగా పూర్తి చేసినందుకు కేంద్రం రాష్ట్రానికి భారీ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఏకంగా రూ.424 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కేవలం మూడు రాష్ట్రాలు మాత్రమే ఈ ఘనత సాధించగా, అందులో తెలంగాణ ముందు వరుసలో ఉండటం విశేషం. ఈ నిధుల రాకతో రాష్ట్ర ఖజానాకు పెద్ద ఊరట లభించినట్లయింది.
రైతులకు అందే ప్రభుత్వ ఫలాలు నేరుగా వారికే అందాలని, మధ్యవర్తుల ప్రమేయం ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్రం ఈ ఫార్మర్ రిజిస్ట్రీ విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రతి రైతుకు ఆధార్ కార్డు తరహాలోనే 11 అంకెలతో కూడిన ఒక యూనిక్ ఐడీ (ప్రత్యేక గుర్తింపు సంఖ్య) క్రియేట్ అవుతుంది. ఇకపై పీఎం కిసాన్ నిధులు కావాలన్నా, విత్తన సబ్సిడీ పొందాలన్నా, ప్రభుత్వం ఇచ్చే రుణాలు లేదా ఇతర రాయితీలు అందాలన్నా ఈ 11 అంకెల ఐడీ నంబర్ తప్పనిసరి. ఈ రిజిస్ట్రీ పూర్తి చేసిన అధికారులను, సిబ్బందిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు.
రైతులు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడం చాలా సులభం. దీనికోసం రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాలను లేదా కామన్ సర్వీస్ సెంటర్లను సంప్రదించాలి. అక్కడ మీ ఆధార్ కార్డు వివరాలు, పట్టదారు పాసుబుక్, బ్యాంకు ఖాతా, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అందిస్తే ప్రక్రియ పూర్తవుతుంది. ప్రతి గ్రామంలో ఉండే ఏఈవోలు కూడా ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పిస్తూ సహాయం చేస్తున్నారు. ఫిబ్రవరి 28వ తేదీని ఇందుకు చివరి గడువుగా కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో, రైతులందరూ త్వరగా ఈ పని పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.
కేవలం తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సిబ్బంది నేరుగా రైతుల దగ్గరికే వెళ్లి ఈ రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తున్నారు. అక్కడ కూడా మెజారిటీ రైతులు ఇప్పటికే ఐడీలను పొందారు. ఈ ఐడీ కార్డు ఉండటం వల్ల భవిష్యత్తులో పంట నష్టపరిహారం వంటివి నేరుగా రైతుల ఖాతాల్లోకే జమ అవుతాయి. డేటా మొత్తం డిజిటలైజ్ కావడం వల్ల అవినీతికి తావుండదు. రైతులు తమ ఐడీ నంబర్‌ను భద్రంగా ఉంచుకోవాలని, ఇది భవిష్యత్తులో వ్యవసాయ సంబంధిత ప్రతి పనికీ కీలకమైన ఆధారంగా మారుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




