No Liquor : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేడు వైన్ షాపులు, బార్లు బంద్

No Liquor : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేడు వైన్ షాపులు, బార్లు బంద్
x
Highlights

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేడు వైన్ షాపులు, బార్లు బంద్

No Liquor : రంగుల పండుగ హోలీ సందర్భంగా భాగ్యనగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైదరాబాద్ సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నగరవ్యాప్తంగా కఠినమైన ఆంక్షలు విధిస్తూ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మందుబాబులకు షాక్ ఇస్తూ, నేడు (మార్చి 3) ఉదయం 6 గంటల నుంచే నగరం అంతటా వైన్ షాపులు, బార్లు, కల్లు కాంపౌండ్లు, క్లబ్‌లను మూసివేయించారు. ఈ ఆంక్షలు సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటాయని, నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్‌లు రద్దు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హోలీ వేడుకల పేరుతో రోడ్లపై హంగామా చేసే వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. బైక్‌లు, కార్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ పాదచారులను, ఇతర వాహనదారులను ఇబ్బంది పెడితే వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. బలవంతంగా రంగులు చల్లడం, నీళ్ల బెలూన్లతో కొట్టడం వంటి పనులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. పండుగ పూట మర్యాదగా, సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోవాలని, ఎదుటివారి స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని కోరారు.

నగరంలో శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు డీజే సౌండ్ సిస్టమ్స్‌పై పోలీసులు నిషేధం విధించారు. ఎక్కడైనా డీజేలు పెట్టి పక్కవారికి ఇబ్బంది కలిగిస్తే సౌండ్ బాక్సులను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. నివాస ప్రాంతాల్లో భారీ శబ్దాలతో సంగీతం ప్లే చేయడం నిబంధనలకు విరుద్ధమని గుర్తు చేశారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడినా లేదా ఇబ్బంది కలిగించినా వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని హైదరాబాద్ వాసులకు సూచించారు.

నగరంలోని ప్రధాన కూడళ్లలో సిసి టీవీల ద్వారా నిరంతరం నిఘా కొనసాగుతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు కూడా ముమ్మరం చేయాలని ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు అందాయి. పండుగను ఆనందంగా జరుపుకోవాలని, గొడవలకు దిగి జైలు పాలు కావొద్దని యువతకు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. హైదరాబాదీలందరూ పోలీసులకు సహకరించి, శాంతియుత వాతావరణంలో హోలీ జరుపుకోవాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories