Hyderabad: కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో మలుపు – నిందితుడు పదో తరగతి విద్యార్థి?

Hyderabad: కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో మలుపు – నిందితుడు పదో తరగతి విద్యార్థి?
x

Hyderabad: కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో మలుపు – నిందితుడు పదో తరగతి విద్యార్థి?

Highlights

కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో పదేళ్ల బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీ వీడింది. పోలీసుల దర్యాప్తులో నిందితుడు పదో తరగతి చదువుతున్న బాలుడని బయటపడింది.

కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో పదేళ్ల బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీ వీడింది. పోలీసుల దర్యాప్తులో నిందితుడు పదో తరగతి చదువుతున్న బాలుడని బయటపడింది. ఆగస్టు 18న మధ్యాహ్నం ఇంట్లో దొంగతనం చేయాలని వెళ్లిన ఆ విద్యార్థి, బాలిక ఇంట్లో ఉండటంతో హత్య చేసినట్టు సమాచారం. ప్రస్తుతం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

ఏం జరిగింది?

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం, ముక్తాక్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ–రేణుక దంపతులు ఐదేళ్లుగా సంగీత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. కృష్ణ స్థానికంగా మెకానిక్‌ షెడ్డు వద్ద పని చేస్తుండగా, రేణుక ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు – సహస్ర(10), కుమారుడు(7) ఉన్నారు. సహస్ర బోయిన్‌పల్లి కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతుండగా, కుమారుడు సమీపంలోని పాఠశాలలో చదువుతున్నాడు.

సోమవారం ఉదయం తల్లిదండ్రులు పనికి వెళ్లగా, కుమారుడు స్కూల్‌కి వెళ్లాడు. అయితే క్రీడోత్సవాల కారణంగా సహస్రకి సెలవు ఉండటంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు.

తండ్రి చూసిన దారుణం

మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్కూల్ సిబ్బంది, "లంచ్ బాక్స్ రాలేదు" అంటూ కృష్ణకు ఫోన్ చేశారు. వెంటనే ఇంటికి వెళ్లిన కృష్ణ తలుపు బయట నుంచి గడియపెట్టినట్టు గమనించారు. తలుపు తెరిచి లోపలికి వెళ్ళగా, మంచంపై సహస్ర రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది.

20 కత్తిపోట్లతో దారుణ హత్య

సహస్ర శరీరంపై దాదాపు 20 కత్తిపోట్లు ఉన్నాయి. వాటిలో 10 గాయాలు మెడపైనే ఉన్నాయి. పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం హత్య ఉదయం 9.30 నుండి 10.30 గంటల మధ్య జరిగిందని తేలింది. అదే సమయంలో బాలిక కేకలు విన్నట్లు పొరుగువారు కూడా సాక్ష్యం ఇచ్చారు.

పోలీసులు డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించగా, అనుమానితుడిని గుర్తించి ఐదు రోజుల దర్యాప్తు తర్వాత అదుపులోకి తీసుకున్నారు. అతడే పదో తరగతి విద్యార్థి అని పోలీసులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories