Nalgonda: నల్గొండ డీసీసీ పీఠంపై తీవ్ర పోటీ

Nalgonda: నల్గొండ డీసీసీ పీఠంపై తీవ్ర పోటీ
x

Nalgonda: నల్గొండ డీసీసీ పీఠంపై తీవ్ర పోటీ

Highlights

కొండేటిని డీసీసీ చీఫ్ చేయాలని జానారెడ్డి ప్రయత్నాలు గుమ్మలకు ఈ పదవిని కట్టబెట్టేందుకు వెంకటరెడ్డి కృషి ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు డీసీసీపై ఫోకస్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 'గేట్‌వే'గా నిలిచిన నల్గొండ జిల్లా రాజకీయాలు మరోసారి ఉత్కంఠగా మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పెరిగినా, జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక మాత్రం ఆ పార్టీకి 'కత్తిమీద సాము'లా తయారైంది. 12 నియోజకవర్గాలున్న ఈ ఉమ్మడి జిల్లాలో ఏకంగా 11 సీట్లలో కాంగ్రెస్ గెలిచి, పార్టీకి లైఫ్‌లైన్‌గా నిలిచింది. అలాంటి కీలక జిల్లాలో ఇప్పుడు అధ్యక్ష పదవి కోసం సీనియర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా, అధిష్టానం పెట్టిన 'కఠిన షరతులు' కలకలం సృష్టిస్తున్నాయి. అసలెందుకీ సమస్య ఉత్పన్నమైంది..? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ ఫోకస్...

నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అలాంటి ప్రాంతంలో డీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకోవడానికి ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి అనుచరుల్లో ఒకరైన కొండేటి మల్లయ్యను డీసీసీ చీఫ్‌గా చేయాలని ఆ పెద్దాయన గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. మరోవైపు రాష్ట్రంలో కీలక మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం తన అనుచరుడైన గుమ్మల మోహన్ రెడ్డికి ఈ పదవిని కట్టపెట్టడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని జిల్లాలో గట్టిగానే టాక్ వినిపిస్తోంది. జిల్లాలో పార్టీకి రెండు ప్రధాన పవర్ సెంటర్‌లుగా ఉన్న జానారెడ్డి, వెంకటరెడ్డి.. తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి నల్గొండ జిల్లా అధ్యక్ష పదవిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. ​సర్వసాధారణంగా.. సీనియర్ల సిఫార్సుల మేరకు జిల్లా అధ్యక్షుల నియామకం జరిగేది. కానీ ఈసారి కాంగ్రెస్ అధిష్టానం అనూహ్యంగా కొన్ని కఠినమైన 'కండిషన్స్' తెరపైకి తెచ్చిందట.


పార్టీ విధించిన షరతులు నల్గొండ లాంటి కీలక జిల్లాలో అమలు చేయడం సాధ్యమేనా అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లోనే తలెత్తుతున్నాయి.​ ఈ కఠిన నిబంధనల వెనుక కాంగ్రెస్ అధిష్టానం ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో కేవలం ఒకరిద్దరు సీనియర్ నేతల పెత్తనాన్ని కాకుండా, పార్టీ నిర్మాణంపై దృష్టి సారించే, అందరినీ కలుపుకొనిపోయే కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలని భావిస్తోందట. అయితే ఈ షరతులు సీనియర్ నేతల సిఫార్సుల ప్రభావం ఉన్న అభ్యర్థులను పూర్తిగా పక్కన పెట్టే ప్రమాదం కూడా లేకపోలేదన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.


నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ సామాజిక సమీకరణాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈసారి బీసీ సామాజిక వర్గం నుంచి పున్నా కైలాస నేత, చనాగాని దయాకర్ వంటి నేతలు డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నాయకత్వం కూడా భావిస్తున్నట్లు సమాచారం. దీంతో కచ్చితంగా నల్లగొండ డిసిసి అధ్యక్ష పదవి బీసీ సామాజిక వర్గానికే వస్తుందన్న చర్చకు బలం చేకూరినట్టయ్యింది.


కాంగ్రెస్ పెద్దలు ఈసారి తమ 'కఠిన షరతులు' అమలు చేస్తారా? లేక నల్గొండ జిల్లా రాజకీయాలను పూర్తిగా అవగాహన చేసుకున్న జానారెడ్డి, కోమటిరెడ్డి వంటి సీనియర్ నేతల మాటకు తలొగ్గుతారా? పార్టీ నిర్మాణం కోసం కొత్త నేతను ఎన్నుకుంటారా..? లేక సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుంటారా? ఈ 'అధ్యక్ష' పంచాయితీ ముగింపు ఎలా ఉంటుందో తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ భవిష్యత్తును ఈ నియామకమే నిర్ణయిస్తుందన్న బలమైన చర్చ రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories