TS Inter Results: కరోనా తర్వాత తొలిసారి.. పాస్‌ పర్శంటేజ్‌లో సత్తా చాటిన ఇంటర్‌ పిల్లలు

TS Inter Results: కరోనా తర్వాత తొలిసారి.. పాస్‌ పర్శంటేజ్‌లో సత్తా చాటిన ఇంటర్‌ పిల్లలు
x
Highlights

TS Inter Results: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాల్లో 71.37శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. కోవిడ్ ఏడాది 2021 కాకుండా...

TS Inter Results: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాల్లో 71.37శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. కోవిడ్ ఏడాది 2021 కాకుండా తొలిసారిగా 70శాతానికిపైగా ఉత్తీర్ణత నమోదు అయ్యింది. అలాగే ఫస్ట్ ఇయర్ లో 66. 89 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 2024తో పోల్చి చూస్తే తొలి ఏడాది ఉత్తీర్ణత 5.83శాతం అధికంగా ఉండగా... అబ్బాయిల కంటే అమ్మాయిల ఉత్తీర్ణత 13 నుంచి 14 శాతం అధికంగా ఉంది. మంగళవారం ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి క్రిష్ణ ఆదిత్య ఫలితాలను విడుదల చేశారు.

మొత్తంగా చూసినట్లయితే ఇంటర్ ఫలితాల్లో ములుగు జిల్లా 80.12శాతం, అగ్రస్థానంలో కామారెడ్డి జిల్లా 54.83శాతంతో చివరిస్థానంలో నిలిచాయి. మొదటి ఏడాదిలో మేడ్చల్ జిల్లా 77. 59శాతం మొదటిస్థానం, మెదక్ జిల్లా 46.87శాతం ఆఖరిస్థానం దక్కించుకున్నాయి. ఇంటర్ జనరల్ తోపాటు ఒకేషనల్ కోర్సు ఫలితాలను కలుపుకుంటే మాత్రం మొత్తం ఉత్తీర్ణత 65.65శాతంగా ఉంది.

ఫలితాల వెల్లడి సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్య వైపు అడుగులు వేసి భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లారని..ఆయన తరపున అభినందనలు చెప్పేందుకు తాను వచ్చానని డిప్యూటీ సీఎం చెప్పారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు.

ఇంటర్ లో తప్పిన వారికోసం మే 22 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి తెలిపారు. ఇక ఈనెల 23 నుంచి 30 వరకు ఆ పరీక్షలతోపాటు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు ఇంటర్ బోర్డ్ వెబ్ సైట్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సప్లిమెంటరీలో పాస్ అయితే రెగ్యులర్ గా పాస్ అయినట్లుగానే పరిగణిస్తారని..ఒకసారి తప్పిన వారి జాబితాలో ఉంటారని తెలిపారు.

కాగా రెగ్యులర్, ప్రైవేట్, ఒకేషనల్ తో కలిపి 3,33,908 మంది ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించారు. వారిలో 2.12 లక్షల మంది ఏ గ్రేడ్ సాధించారు. తొలి ఏడాదిలో 3.22 లక్షల మంది ఉత్తీర్ణులు అయ్యారు. వారిలో 2.07 లక్షల మందికి ఏ గ్రేడ్ వచ్చింది. మొదటిఏడాదిలో నలుగురు, సెకండ్ ఇయర్ లో ఆరుగురు ఫలితాలను విత్ హెల్డ్ లో ఉంచారు. అతితక్కువగా హెచ్ఈసీలో 46.26శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. అత్యధికంగా ఎంపీసీలో 72.23 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories