KCR : తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో సిట్ అధికారులు నిర్వహించిన సుదీర్ఘ విచారణ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం మధ్యాహ్నం నందినగర్‌లోని ఆయన నివాసంలో జరిగిన ఈ పరిణామం, కేవలం ఒక విచారణ మాత్రమే కాదు.. ఈ కేసులో తదుపరి ఏం జరగబోతోందనే దానికి ఒక సంకేతంగా కనిపిస్తోంది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించేందుకు సిట్ అధికారులు ఆదివారం ఆయన నివాసానికి చేరుకోవడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నిజానికి మొదట కేసీఆర్ తనను ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కలవాలని కోరినప్పటికీ, సిట్ పట్టుబట్టడంతో నందినగర్‌లోనే విచారణకు అంగీకరించారు. జాయింట్ సీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో వచ్చిన 15 మంది అధికారుల బృందం, కేసీఆర్‌ను దాదాపు నాలుగున్నర గంటల పాటు విచారించింది.
ఈ విచారణలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. అధికారులు వెంట తెచ్చుకున్న రెండు ట్రంకు పెట్టెలు. వీటిలో ఇప్పటివరకు దర్యాప్తులో సేకరించిన డాక్యుమెంట్లు, డిజిటల్ సాక్ష్యాలు, నిందితుల వాంగ్మూలాలు ఉన్నట్లు సమాచారం. కేసీఆర్ నివాసంలోని రెండో అంతస్తులో ఒక ప్రత్యేక గదిలో ఈ విచారణ జరిగింది. నిబంధనల ప్రకారం ఆయన న్యాయవాదులను కూడా లోపలికి అనుమతించలేదు. కేవలం కేసీఆర్‌ను మాత్రమే అధికారులు ఎదురుగా కూర్చోబెట్టుకుని ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయడం చూస్తుంటే, దీనిని కోర్టులో కీలక సాక్ష్యంగా సమర్పించే అవకాశం కనిపిస్తోంది.
అసలు అధికారులు ఏ విషయాలపై కేసీఆర్‌ను నిలదీశారు?
ప్రధానంగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావులకు పదవీ విరమణ తర్వాత కూడా ఎక్స్టెన్షన్ ఎందుకు ఇచ్చారు? వారు తరచూ ప్రగతి భవన్ కు ఎందుకు వచ్చేవారు? అనే కోణంలో ప్రశ్నలు సాగాయి. అలాగే, కేవలం ప్రతిపక్ష నేతల ఫోన్లే కాకుండా సొంత పార్టీ బీఆర్ఎస్ నేతల ఫోన్లను కూడా ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందనే ప్రశ్న ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇక వ్యాపారులపై నిఘా ఉంచి వసూలు చేసిన నిధులు పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో చేరాయా? అనే కోణంలో కూడా సిట్ ఆరా తీసింది. విచారణ ముగిసిన వెంటనే సిట్ బృందం కమిషనర్ సజ్జనార్‌తో భేటీ అవ్వడం చూస్తుంటే, త్వరలోనే ఈ కేసులో మరో కీలక పరిణామం లేదా అరెస్టులు ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire






