
Maoist Leader Deoji Surrender
తెలంగాణ డీజీపీ వద్ద ఈరోజు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ లొంగుబాటా వెనుక కారణాలు ఇవే
దేశాన్ని మావోయిస్ట్ రహితంగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు మరో ముగ్గురు అగ్రనేతలు మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో అడవుల్లో భద్రతా బలగాల ఒత్తిడి పెరగడం, అగ్రనేతలు వరుసగా మరణిస్తుండటంతో వీరు జనజీవన స్రవంతిలో కలిసేందుకు మొగ్గు చూపారు.
లొంగిపోయిన వారిలో దేవ్జీతో పాటు మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నర్సింహారెడ్డి వంటి కీలక నేతలు ఉన్నట్లు డీజీపీ అధికారికంగా ప్రకటించారు. గత రెండేళ్లలో ఇప్పటివరకు 591 మంది నక్సలైట్లు ఆయుధాలు వీడి బయటకు వచ్చారని ఆయన వెల్లడించారు. ఇందులో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు, నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు ఉండటం గమనార్హం.
దేవ్‌జీ విప్లవ ప్రస్థానం ఇదే..
తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ విప్లవ ప్రస్థానం దశాబ్దాల కాలం నాటిది. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఆయన, 1980లలో విద్యార్థి దశలోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ భావజాలానికి ఆకర్షితుడయ్యారు. 1983లో డిగ్రీ మధ్యలోనే వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. హిందీ, గోండి భాషల్లో ప్రావీణ్యం ఉన్న ఆయన, పార్టీలో మిలిటరీ కమిషన్ ఇన్‌ఛార్జ్‌గా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా అత్యున్నత బాధ్యతలు నిర్వహించారు.
కోటి రూపాయల రివార్డ్..
దేవ్‌జీపై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కలిపి రూ. కోటి రివార్డు ఉంది. 2003లో అలిపిరి వద్ద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై జరిగిన దాడిలోనూ, 2010లో దంతెవాడలో 74 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి కారణమైన ఘటనలోనూ ఆయన కీలక సూత్రధారిగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఎన్ఐఏ (NIA) మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఆయన పేరు ఉంది.
లొంగుబాటు వెనుక కారణాలివే..
గత ఏడాది కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (బస్వరాజ్) మరణం తర్వాత, పార్టీ బాధ్యతలు దేవ్‌జీ భుజాన పడ్డాయి. అయితే, ఛత్తీస్‌గఢ్ అడవుల్లో పోలీసుల కూంబింగ్ ముమ్మరం కావడంతో నాయకత్వ లోపం ఏర్పడింది. మరోవైపు అజ్ఞాతంలో ఉన్న మరో 11 మంది తెలంగాణ ప్రాంత మావోయిస్టులు కూడా చర్చలు జరుపుతున్నారని, వారు కూడా త్వరలోనే లొంగిపోయే అవకాశం ఉందని డీజీపీ ఆశాభావం వ్యక్తం చేశారు.
మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టుల ప్రాబల్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహం ప్రస్తుతం వేగంగా అమలువుతోంది. దేవ్‌జీ వంటి అగ్రనేత లొంగిపోవడం మావోయిస్టు ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున పునరావాస ప్యాకేజీలు అందుతాయని పోలీస్ వర్గాలు తెలిపాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




