Maoist Surrender: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. హిడ్మా సన్నిహితుడు బరిసె దేవా లొంగుబాటు

Maoist Surrender: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. హిడ్మా సన్నిహితుడు బరిసె దేవా లొంగుబాటు
x

Maoist Surrender: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. హిడ్మా సన్నిహితుడు బరిసె దేవా లొంగుబాటు

Highlights

మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్. GLA చీఫ్ బరిసె దేవా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగుబాటు. హిడ్మా సన్నిహితుడి లొంగుబాటు మావోయిస్టులకు భారీ నష్టం.

మావోయిస్టు పార్టీకి మరో కీలక ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (GLA) చీఫ్‌గా వ్యవహరిస్తున్న బరిసె దేవా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. శనివారం డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగుబాటు కార్యక్రమం జరగనుందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

హిడ్మా తరువాత మావోయిస్టు సాయుధ బలగాల కార్యకలాపాలను సమన్వయం చేసే కీలక నేతగా బరిసె దేవా కొనసాగుతున్నారు. హిడ్మా, బరిసె దేవా ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారని సమాచారం. సుదీర్ఘకాలంగా అండర్‌గ్రౌండ్‌లో ఉంటూ మావోయిస్టు మిలిటరీ వ్యూహాలు, ఆయుధాల సరఫరాలో దేవా కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు.

ప్రత్యేకంగా అత్యాధునిక ఆయుధాల నిర్వహణ, సరఫరా బాధ్యతలు బరిసె దేవా వద్దనే ఉండేవని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. ఆయన వద్ద మొత్తం 12 మౌంటెయిన్ LMG (లైట్ మెషిన్ గన్) వెపన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఆయుధాలకు హెలికాప్టర్లను కూల్చే సామర్థ్యం ఉండటం గమనార్హం. ఇప్పటికే ఈ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

బరిసె దేవాతో పాటు మరికొందరు కీలక మిలిటరీ ఆపరేషన్ సభ్యులు కూడా లొంగిపోనున్నట్లు సమాచారం. ఈ లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ మిలిటరీ నెట్‌వర్క్ తీవ్రంగా దెబ్బతింటుందని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో కొనసాగుతున్న మావోయిస్టు కార్యకలాపాలపై ఇది గణనీయమైన ప్రభావం చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కేంద్ర హోంశాఖ ఈ లొంగుబాటును స్వాగతిస్తూ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల లొంగుబాటు, పునరావాస విధానాలకు ఇది నిదర్శనమని పేర్కొంది. మావోయిస్టులు హింసను వీడి ప్రజాస్వామ్య మార్గంలోకి రావాలని మరోసారి పిలుపునిచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories