Medaram Jathara 2026: గ్రానైట్ నిర్మాణాలతో టెంపుల్ సిటీగా మారిన మేడారం

Medaram Jathara 2026: గ్రానైట్ నిర్మాణాలతో టెంపుల్ సిటీగా మారిన మేడారం
x

Medaram Jathara 2026: గ్రానైట్ నిర్మాణాలతో టెంపుల్ సిటీగా మారిన మేడారం

Highlights

మేడారం సమ్మక్క సారక్క జాతర 2026కు సర్వం సిద్ధం. గ్రానైట్ నిర్మాణాలు, డబుల్ రోడ్లు, సెంటర్ లైటింగ్‌తో మేడారం టెంపుల్ సిటీగా మారింది.

వనదేవతలు సమ్మక్క–సారలమ్మలు కొలువుతీరే మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమవుతోంది. 2026 సమ్మక్క సారక్క జాతరను దృష్టిలో ఉంచుకొని మేడారం పూర్తిగా టెంపుల్ సిటీగా రూపాంతరం చెందింది. కాకతీయుల కాలంనాటి నిర్మాణాలను తలపించేలా అధునాతన గ్రానైట్ నిర్మాణాలు, విశాలమైన డబుల్ రోడ్లు, సెంటర్ లైటింగ్, ఆకర్షణీయమైన కూడళ్లు మేడారానికి కొత్త శోభను తీసుకొచ్చాయి.

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన ఈ మహాజాతర ప్రారంభోత్సవాన్ని ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నిర్వహించనున్నారు. జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న 2026 మహాజాతర సందర్భంగా మాఘశుద్ధ పౌర్ణమి వేళ సమ్మక్క–సారలమ్మలతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజుల ప్రతిరూపాలు గద్దెలపై కొలువుదీరనున్నాయి.

సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక మంత్రి సీతక్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవతో మేడారంలో శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టారు. ఊరట్టం సర్కిల్ నుంచి జంపనవాగు మీదుగా గద్దెల వరకు డబుల్ రోడ్లు, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేశారు. తాడ్వాయి వైపు నుంచి వచ్చే భక్తులకు స్వాగతం పలికేలా ఆదివాసీ సంప్రదాయాలను ప్రతిబింబించే స్వాగత తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

గద్దెల ప్రాంగణం పూర్తిగా గ్రానైట్‌తో ఆధునీకరించారు. ఎనిమిది ప్రధాన ద్వారాలు, 16 భారీ పిల్లర్లు, వాటిపై ఆదివాసీ ఆచారాలను ప్రతిబింబించే చిత్రలిపులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఆళ్లగడ్డ నుంచి తెప్పించిన సుమారు 4 వేల టన్నుల గ్రానైట్‌తో నిర్మాణాలు చేపట్టారు. దాదాపు 2 వేల మంది కార్మికులు నిర్విరామంగా శ్రమించి ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు.

దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం జాతరకు ఈసారి వచ్చే భక్తులు, మేడారంలో అడుగుపెట్టగానే ఆశ్చర్యానికి గురయ్యేలా ఏర్పాట్లు జరిగాయి. శాశ్వత నిర్మాణాలతో, సౌకర్యాలతో మేడారం మహాజాతర 2026 మరింత వైభవంగా జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories