Megastar Chiranjeevi: "క్యాన్సర్‌ను చూసి భయపడొద్దు.. అవగాహనతో గెలవొచ్చు": కిమ్స్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి భరోసా!

Megastar Chiranjeevi: క్యాన్సర్‌ను చూసి భయపడొద్దు.. అవగాహనతో గెలవొచ్చు: కిమ్స్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి భరోసా!
x
Highlights

Megastar Chiranjeevi: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (ఫిబ్రవరి 4) సందర్భంగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రి (KIMS Hospitals) లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Megastar Chiranjeevi: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (ఫిబ్రవరి 4) సందర్భంగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రి (KIMS Hospitals) లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి, క్యాన్సర్‌ను జయించిన వారిలో (Survivors) ధైర్యాన్ని నింపారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. క్యాన్సర్ సోకడం అంటే మరణ శాసనం రాసుకోవడం కాదని స్పష్టం చేశారు. "సరైన సమయంలో వ్యాధిని గుర్తిస్తే క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. ప్రజలు ఈ వ్యాధిపై భయం వీడి అవగాహన పెంచుకోవాలి. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెనుకాడకుండా వైద్యులను సంప్రదించాలి" అని ఆయన సూచించారు. చిన్న వయసులోనే పిల్లలు క్యాన్సర్ బారిన పడటం చూస్తుంటే ఎంతో బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

కిమ్స్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మధు దేవరశెట్టి మాట్లాడుతూ.. గతంలో 40 ఏళ్లు పైబడిన వారిలోనే ఈ వ్యాధి కనిపించేదని, కానీ ఇప్పుడు 5 నుంచి 10 ఏళ్ల లోపు పిల్లల్లో కూడా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. కలుషిత ఆహారం, రసాయనాలు, ఒత్తిడి మరియు జీవనశైలి మార్పులే దీనికి కారణమని వివరించారు.

క్యాన్సర్ నుంచి కోలుకున్న వారు తమ అనుభవాలను పంచుకోవడానికి, తోటి రోగుల్లో ధైర్యాన్ని నింపడానికి కిమ్స్ ఆసుపత్రిలో 'క్యాన్సర్ ఫైట్ సపోర్ట్ గ్రూప్'ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు, డాక్టర్ నరేందర్ కుమార్ తోట మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. క్యాన్సర్‌ను జయించిన వారు తమ పోరాట పటిమను వివరిస్తూ అందరిలోనూ స్ఫూర్తిని నింపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories