Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల హీటు


Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల హీటు
ఈ నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఊపందుకున్న ప్రీపోల్ సర్వేలు ఒక్కో సర్వేలో ఒక్కో ఫలితం కొన్ని కాంగ్రెస్.. మరికొన్ని బీఆర్‌ఎస్‌వైపు మొగ్గు ఎన్నికల సర్వేలపై ఓటర్లలో అయోమయం ఇంతకీ ఎన్నికల సర్వేలు నిజమవుతాయా..?
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం హీటెక్కింది. నేతల మధ్య మాటల యుద్ధం పీక్స్‌కు చేరింది. ఈ ఉపఎన్నిక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు కీలకం కావడంతో అన్ని ప్రధాన పార్టీలు గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ పోలింగ్‌ను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తుంటే... మరోవైపు ప్రీపోల్ సర్వేలు కూడా ఊపందుకున్నాయి. పోటాపోటీగా ప్రీపోల్ సర్వే ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఆ ఫలితాలు నిశితంగా గమనిస్తే ఎవరి సర్వే వారిదే అన్నట్టుగా ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే సర్వే సంస్థలు నిర్వహించే అభిప్రాయ సేకరణ ఎంత వరకు ప్రామాణికమన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇంతకీ ప్రీపోల్, ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎంత వరకు నిజమవుతాయి..?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి కాక రేపుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ముక్కోణ పోటీ నెలకొంది. దీంతో మూడు పార్టీల నేతల మధ్య పదునైన మాటల యుద్ధం నడుస్తోంది. బీఆర్‌ఎస్ సెంటిమెంట్ ఒకవైపు.. అధికారంలో ఉన్నాం అభివృద్ధి జరుగుతుందన్న కాంగ్రెస్ ప్రచారం మరోవైపు హోరెత్తుతున్నాయి. పోటీలో మూడు ప్రధాన పార్టీలు ఉన్నప్పటికీ పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఉంటుందనే చర్చ జోరుగా సాగుతోంది.
ఎన్నికల ప్రచారంలో ఎన్ని హామీలు గుప్పించినా.. ఓటర్లను ప్రసన్నం చేసుకుని గెలిచేది మాత్రం ఒక్కరే. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయఢంకా మోగించే ఆ ఒక్కరు ఎవరన్నదే తీవ్ర ఉత్కంఠగా మారింది. గెలుపోటములపై ఈపాటికే బెట్టింగులు జోరందుకున్నాయి. మరోవైపు పోల్ సర్వేలు కూడా ఊపందుకున్నాయి. ఇటీవలే కేకే అనే సర్వే సంస్థ సర్వే ఫలితాలు విడుదల చేసింది. ఈ సర్వేలో బీఆర్ఎస్‌కే మెజారిటీ డివిజన్లలో పట్టు ఉన్నట్లు ఆ సర్వేలో తేలింది. దాదాపు ఏడు డివిజన్లలో 5 డివిజన్లు బీఆర్ఎస్‌కే భారీ మెజారిటీ ఉన్నట్లు ఆ సర్వే తేల్చింది. ఇక ఈ సర్వే బీఆర్ఎస్ వాళ్లే చేయించారని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఇలాఉంటే కేకే సర్వే తర్వాత సైదులు ఒక సర్వే చేశారు. ఈ సర్వే పూర్తిగా హస్తం పార్టీవైపే మొగ్గు చూపింది. ఒక డివిజన్ మినహా మిగతా డివిజన్లలో కాంగ్రెస్ పార్టీవైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు చెప్పుకొచ్చింది. అది కూడా భారీ డిఫరెన్స్‌తో హస్తం పార్టీ ముందు వరసలో ఉన్నట్లు సైదులు సర్వే తేల్చింది. మరోవైపు చాణక్య, ఓటా అనే మరో రెండు సర్వే సంస్థలు బీఆర్‌ఎస్ స్వల్ప మెజార్టీతోనైనా బయట పడుతుందంటూ తేల్చిచెబుతున్నాయి. ఇలా ఒక్కో సర్వే సంస్థ.. ఒక్కో ఫలితం వస్తుందని తేల్చడంతో ఓటర్లలో ఒకింత అయోమయం క్రియేట్ అవుతుందన్న చర్చ రాజకీయ పరిశీలకుల్లో నడుస్తోంది.
లక్షల్లో ఓట్లు ఉన్న నియోజకవర్గంలో కేవలం వేలల్లో శాంపిల్స్ తీసుకుని రాబోయే ఫలితాలు ఎలా డిసైడ్ చేస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అయితే పోలింగ్ బూత్‌కు వెళ్లే ఓటరు.. నిజానికి మూడు రకాలుగా ఉంటారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే ఓటు ఎవరికి వేయాలో డిసైడ్ అయినవారు కొందరుంటే.. ఈవీఎం వరకు వెళ్లి ఆలోచన చేసేవారు మరికొందరు.. ప్రలోభాలకు తలొగ్గి ఓటు వేసేవారు ఇంకొందరు ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా ఓటరు ఇన్ని విధాలుగా ఉంటే సర్వే సంస్థలు మాత్రం అతికొద్ది శాంపిల్స్ తీసుకుని గెలుపోటములను ఎలా డిసైడ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఎక్కడ.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎక్కువగా చర్చ జరిగేది ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్ సర్వేల గురించే. వీటి గురించి జనం కంటే ఎక్కువగా చర్చించుకునేది రాజకీయ పార్టీలే. పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి. అందుకే రాజకీయ పార్టీలు స్వయంగా ఈ సర్వేలు చేయించుకుంటాయి. అసలు ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్ సర్వే అంటే ఏంటీ? ఎలా చేస్తారు? వాటి విశ్వసనీయత ఎంత? అన్నది అందరి మదిని తొలిచే సందేహం. ఎన్నికల ముందు పలు పార్టీలపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ప్రీపోల్ సర్వే నిర్వహిస్తారు. సర్వేలో పాల్గొనవాళ్లు పార్టీలపై ఉన్నతమ అభిప్రాయాన్ని చెబుతారు. వాటి ఆధారంగా ఫలితాలను అంచనా వేస్తారు సర్వే నిర్వాహకులు. సర్వేలో పాల్గొనవాళ్లు కచ్చితంగా ఓటు వేస్తారా? లేదా? అన్నది చెప్పడానికి లేదు. అసలు ఓటు లేనివాళ్లు కూడా ఈ సర్వేలో తమ అభిప్రాయం చెప్పొచ్చు. ఓటు విషయమే కాదు.. వివిధ అంశాలపైనా సర్వే నిర్వహించేవాళ్లు ఓ ప్రశ్నావళి రూపొందించి అభిప్రాయాలు తెలుసుకుంటారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత, అభ్యర్థులు ఖరారైనప్పుడు, పోలింగ్‌కు వారం ముందు... ఇలా దశల వారీగా ప్రీపోల్ సర్వే నిర్వహిస్తారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విషయానికొస్తే షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నికలకు ముందు వరకు నిర్వహించినవన్నీ ప్రీపోల్ సర్వేలు. ఎన్నికలకు ముందు నిర్వహించే ఒపీనియన్ పోల్ కాబట్టి... ఓటర్ల అభిప్రాయం పోలింగ్ నాటికి మారొచ్చు. ఓటర్ల అభిప్రాయం అభ్యర్థులను ఎంపిక చేయకముందు ఒకలా, అభ్యర్థులను ప్రకటించినప్పుడు మరోలా, ప్రచార పర్వం ముగిసేనాటికి ఇంకోలా ఉండొచ్చు. సర్వేలో పాల్గొంటున్నవాళ్లు నిజమే చెప్పాలని ఏమీ లేదు. కాకపోతే ప్రజల మూడ్ అంచనా వేసేందుకు ఒపీనియన్ పోల్ ఉపయోగపడుతుందన్న అభిప్రాయం ఉంది. అది ఏమాత్రం సైంటిఫిక్ మెథడ్ కాదన్నది నగ్నసత్యం.
ఓటర్లు ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత నిర్వహించే అభిప్రాయ సేకరణే ఎగ్జిట్ పోల్ సర్వే. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరిగే ఈ నెల 11న ఓటు వేసినవారందరితో చేసే సర్వే అన్నమాట. అయితే గతంలో ప్రీపోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్ ఫలితాలకు కచ్చితత్వం ఎక్కువగా ఉండేదన్న అభిప్రాయం లేకపోలేదు. కానీ ఇటీవల కాలంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా తారుమారు అవుతున్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ప్రీపోల్ సర్వే కాని, ఎగ్జిట్ పోల్ సర్వే కానీ వంద శాతం కచ్చితంగా ఉంటాయని చెప్పలేం. మార్జినల్ ఎర్రర్స్ తప్పకుండా ఉంటాయి. ఎక్కువగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు తారుమారవుతుంటాయి. ఇందుకు పలు కారణాలు లేకపోలేదు. సర్వే నిర్వహించేవారు ఓటర్లతో మాట్లాడి ఎవరికి ఓటు వేశారని తెలుసుకుంటారు. అయితే ప్రీపోల్ సర్వేలో అభిప్రాయం చెప్పినట్టుగా ఎగ్జిట్ పోల్‌లో ఓటర్లు స్వేచ్ఛగా అభిప్రాయం వెల్లడించకపోవచ్చు. ఎందుకంటే... చాలామందికి తాము ఎవరికి ఓటు వేశామో చెప్పుకోవడం ఇష్టం ఉండదు. ఇక్కడ కూడా ఓటర్లు అబద్ధం చెప్పే అవకాశముంది.
ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్ సర్వేల విషయంలో ఎన్నికల కమిషన్ కొన్ని నిబంధనలు విధించింది. ఎన్నికల ప్రచారం గడువు ముగిసేలోపు మాత్రమే ప్రీపోల్ సర్వే వెల్లడించాలి. ఇక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం అన్ని విడతల పోలింగ్ ముగిసిన గంట తర్వాత వెల్లడించాలి. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై వస్తున్న ప్రీపోల్ సర్వే ఫలితాలు భిన్నంగా ఉంటున్నాయి. ఎవరి సర్వే వారిదే అన్నట్టుగా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సర్వేల మాట ఎలా ఉన్నా.. ఓటరు తీర్పే ఫైనల్. ఈ నెల 14న విడుదల కానున్నజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



