
Vem Narender Reddy
తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీలను కాంగ్రెస్ ఖరారు చేసింది. సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డికి ఈసారి అవకాశం దక్కింది.
Telangana Politics : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఒక స్థానానికి ఎంపికవ్వగా, అధిష్ఠానం కోటాలో సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీకి రెండోసారి అవకాశం దక్కింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి రాకముందు నుంచే వేం నరేందర్ రెడ్డి ఆయన వెంటే ఉంటూ నమ్మిన బంటులా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆయన విధేయతకు దక్కిన అతిపెద్ద బహుమతిగా రాజకీయ విశ్లేషకులు దీన్ని అభివర్ణిస్తున్నారు.
రాజ్యసభ బరిలో నిలవడానికి కాంగ్రెస్ నుంచి భారీగా పోటీ నెలకొంది. రెండు సీట్ల కోసం ఏకంగా 36 మంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు. సింఘ్వీ పేరు మొదటి నుంచే ఖరారు కావడంతో, మిగిలిన ఒక్క సీటు కోసం 16 మంది నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. వడపోత తర్వాత ఈ సంఖ్య నలుగురికి చేరింది. చివరి నిమిషంలో వరంగల్ నేత దొమ్మాటి సాంబయ్య పేరు కూడా బలంగా వినిపించినా, సీఎం రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనలు, ముఖ్యమైన కార్యక్రమాల్లో నీడలా వెంట ఉండే వేం నరేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. పార్టీ అధిష్ఠానం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వేం అభ్యర్థిత్వం ఖరారైంది.
మరోవైపు, అభిషేక్ మను సింఘ్వీని రెండోసారి రాజ్యసభకు పంపడం ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ ఆయనపై ఉన్న నమ్మకాన్ని పునరుద్ఘాటించింది. గతంలో కేకే రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికలో సింఘ్వీ తెలంగాణ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికై రెండేళ్ల పాటు కొనసాగారు. ఇప్పుడు ఆయన పదవీ కాలం ముగియడంతో మళ్లీ ఆయనకే రెన్యువల్ ఇచ్చారు. ఢిల్లీ స్థాయిలో పార్టీకి సంబంధించిన న్యాయపరమైన అంశాల్లో సింఘ్వీ కీలక పాత్ర పోషిస్తున్నందున ఆయన ఎంపిక అనివార్యమైంది.
అయితే, ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎలాంటి ఎత్తుగడ వేయబోతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ దగ్గర ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకోవడానికి సరిపడా సంఖ్యాబలం ఉంది. కానీ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టాలని గులాబీ పార్టీ భావిస్తే మాత్రం కథ మారుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థిని పోటీకి నిలిపి, విప్ జారీ చేస్తే.. ఆ పదిమంది ఎమ్మెల్యేలు ఎటు ఓటు వేయాలనే సందిగ్ధంలో పడతారు. కాకపోతే, ఇప్పటికైతే బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అభ్యర్థులు ఎవరూ లేకపోతే ఈ ఇద్దరి ఎన్నిక ఏకగ్రీవం కావడం ఖాయం.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




