తెలంగాణలో కొత్తగా 4000 ఆర్ఎస్ఎస్ శాఖలు... వచ్చే ఎన్నికల నాటికి RSS బీజేపికి గ్రౌండ్ రెడీ చేస్తోందా?

RSS planning to add 4000 branches in Telangana which is a plus point to BJP to grow its wings in state by next assembly elections
x

తెలంగాణలో కొత్తగా 4000 ఆర్ఎస్ఎస్ శాఖలు... వచ్చే ఎన్నికల నాటికి బీజేపికి ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ రెడీ చేస్తోందా?

Highlights

What is RSS Future plans in Telangana: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపికి బలం పెంచేందుకు ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందా అంటే అవుననే అభిప్రాయం...

What is RSS Future plans in Telangana: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపికి బలం పెంచేందుకు ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా తెలంగాణలో సంస్థను విస్తరించడం కోసం ఆర్ఎస్ఎస్ భారీ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే వచ్చే దసరా పండగ నాటికి తెలంగాణలో 4000 కొత్త కేంద్రాలు ప్రారంభించాలని ఆర్ఎస్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఇది బీజేపికి కలిసొచ్చే అంశంగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

ఆర్ఎస్ఎస్ విస్తరించడానికి బీజేపికి లింక్ ఏంటి?

ఆర్ఎస్ఎస్ విస్తరించడానికి బీజేపికి లింక్ ఏంటి అని ఎవరికైనా ఒక సందేహం రావచ్చు. కానీ ఇక్కడ ఒకసారి ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని గుర్తుచేసుకుంటే అది నిజమేనని అనిపించకమానదని విశ్లేషకులు చెబుతున్నారు.

బీజేపికి అనుబంధ సంస్థగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తోన్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో బీజేపి విజయం కోసం ఆర్ఎస్ఎస్ తీవ్రంగా కృషిచేసింది. ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించడంలో క్షేత్రస్థాయిలో బీజేపితో కలిసి పనిచేసింది. మహారాష్ట్రలో బీజేపి బలం పెంచుకోవడం ఆర్ఎస్ఎస్‌కు కూడా ఒక అనివార్యమైన పరిస్థితిగా భావించిందని, అందుకే బీజేపి నేతలతో సమానంగా ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొందనేది మహారాష్ట్ర ఎన్నికలను నిశితంగా పరిశీలించిన విశ్లేషకులే చెబుతున్న మాట.

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లోనూ బీజేపి ఘన విజయం సొంతం చేసుకుంది. మహాయుతి కూటమిలో ఇతర పార్టీలైన ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ, అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీల కంటే బీజేపినే ఎక్కువ సీట్లు గెలుచుకుని పైచేయి సాధించింది. అందులో ఆర్ఎస్ఎస్ కృషి ఎంతో ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అందుకే తెలంగాణలోనూ ఆర్ఎస్ఎస్ విస్తరిస్తే అది భవిష్యత్‌లో బీజేపికే కలిసొచ్చే అంశం అవుతుందని మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు గుర్తుచేస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.

బీజేపి బలానికి ఆర్ఎస్ఎస్ తోడైతే...

ఇప్పటికే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల నాటికి బీజేపి బలం పుంజుకుంది. గతంలో 4 లోక్ సభ స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపి చివరి లోక్ సభ ఎన్నికల్లో ఆ సంఖ్యను డబుల్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అంతకు ముందు ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన బీజేపికి ప్రస్తుతం అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ 2 స్థానాలు గెలుచుకుని ఉత్తర తెలంగాణలో పట్టు పెంచుకుంది. 2018 తరువాత జరిగిన ఎన్నికల్లో బీజేపికి ఓటు షేర్ కూడా పెరుగుతూ వచ్చింది. బీజేపి సొంత బలానికి ఆర్ఎస్ఎస్ కూడా తోడైతే ఆ పార్టీ ఇంకెంత ముందుకెళ్తుందో చెప్పడం పెద్ద కష్టమేం కాదు. అదే కానీ జరిగితే రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపి, బీఆర్ఎస్ పార్టీల మధ్య గట్టి పోటీ తప్పదు.

ఇక తెలంగాణలో ఆర్ఎస్ఎస్ వ్యాప్తి విషయానికొస్తే...

1925 సెప్టెంబర్ 27న దసరా సందర్భంగా కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ నాగపూర్‌లో ఆర్ఎస్ఎస్‌ను స్థాపించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 ఏళ్లు పూర్తి అవుతుంది. 100వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్ఎస్ఎస్ తెలంగాణలోని ప్రతీ గ్రామంలో తమ సేవలు అందుబాటులోకి రావాలనేదే తమ లక్ష్యం అని ఆర్ఎస్ఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కాచం రమేశ్ తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి ఆర్ఎస్ఎస్ చేరుకునేలా నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. పాంప్లెట్స్, బుక్స్ పంపిణీ రూపంలో ప్రతీ ఇంటికి ఆర్ఎస్ఎస్ ను చేర్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో 1,839 ప్రాంతాల్లో 3,117 కేంద్రాలు పనిచేస్తున్నాయి. రాష్ట్ర ఆర్ఎస్ఎస్ విభాగం ప్రతి నెల 382 సమావేశాలు నిర్వహిస్తోంది. పట్టణ ప్రాంతాలైనా లేక గ్రామీణ ప్రాంతాలైనా... ప్రతీ 10,000 మంది జనాభా ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా గుర్తించి ఆర్ఎస్ఎస్‌ను విస్తరిస్తున్నట్లు తెలిపారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడిని ఖండించిన ఆర్ఎస్ఎస్

బంగ్లాదేశ్‌లో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఆర్ఎస్ఎస్ ఖండించింది. హిందువులను అణిచివేయడమే లక్ష్యంగా ఆ దాడులు ఒక పథకం ప్రకారం జరుగుతున్నాయని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాలి అని రమేశ్ పిలుపునిచ్చారు.

లక్షకుపైగా ప్రాంతాల్లో వారోత్సవాలు

సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్య లక్షకుపైగా ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో తమ ఉనికిని పెంచుకోవడమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ ముందడుగు వేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories