KCR SIT Investigation : నేడు సిట్ ముందుకు గులాబీ బాస్.. నందినగర్ నివాసంలో కేసీఆర్ విచారణ

KCR SIT Investigation : నేడు సిట్ ముందుకు గులాబీ బాస్.. నందినగర్ నివాసంలో కేసీఆర్ విచారణ
x
Highlights

నేడు సిట్ ముందుకు గులాబీ బాస్.. నందినగర్ నివాసంలో కేసీఆర్ విచారణ

KCR SIT Investigation : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు సిట్ అధికారుల విచారణకు హాజరుకానున్నారు. గడిచిన వారం రోజులుగా నోటీసుల విషయంలో సిట్ అధికారులకు, కేసీఆర్‌కు మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. అధికారులు కేసీఆర్ ఇంటి గోడకు నోటీసులు అంటించగా, దానిని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో ఉంటానని, అక్కడికే వచ్చి విచారణ చేయాలని కోరినప్పటికీ.. సిట్ అందుకు నిరాకరించింది. చివరకు హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలోనే మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరగనుంది.

ఈ నేపథ్యంలో కేసీఆర్ షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 9 గంటలకే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి, 11 గంటల కల్లా నందినగర్ చేరుకోనున్నారు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్ వంటి కీలక నేతలను విచారించిన సిట్.. ఇప్పుడు కేసీఆర్‌ను ప్రశ్నించడం ద్వారా ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించాలని భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ విచారణ సందర్భంగా బంజారాహిల్స్ ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడమే కాకుండా, భారీగా బలగాలను మోహరించారు.

మరోవైపు, ఈ విచారణను రాజకీయ కుట్రగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. మున్సిపల్ ఎన్నికల ముందు తమ పార్టీని దెబ్బతీయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ.. నేడు రాష్ట్రవ్యాప్త శాంతియుత ఆందోళనలకు పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నాయి. నందినగర్ వద్ద కార్యకర్తలు భారీగా గుమికూడే అవకాశం ఉండటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తున్నారు. ఈ కేసు ఫలితం ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాన్ని కలిగిస్తుందో అన్నది రాబోయే ఎన్నికల ఓట్లపై ప్రభావం చూపనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories