BC Reservation : తెలంగాణ స్థానిక ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు కీలకం!!

తెలంగాణ స్థానిక ఎన్నికలు: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు కీలకం..
x

తెలంగాణ స్థానిక ఎన్నికలు: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు కీలకం..

Highlights

తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ స్థానిక ఎన్నికల నిర్వహణకు కీలకంగా మారనున్న హైకోర్టు తీర్పు.

తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. ఇప్పటికే గత విచారణలో బీసీ బిల్లుపై ప్రశ్నలు సంధించిన హైకోర్టు.. ఎలాంటి తీర్పు ఇస్తుందనేది రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. అయితే ఈ జీవోను వ్యతిరేకిస్తూ మాధవరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కల్పించడంతో రిజర్వేషన్లు 69 శాతానికి చేరాయి. పంచాయితీరాజ్ చట్టంలోని 285 సెక్షన్ ‘ఏ’ కు ఇది విరుద్దమని పిటిషనర్ మాధవరెడ్డి తరపు న్యాయవాదులు గత విచారణలో హైకోర్టులో వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు దృష్టికి తెచ్చారు. అయితే తమిళనాడులో రిజర్వేషన్లు 50 శాతానికి మించినట్టు హైకోర్టు ప్రస్తావించింది. అదే సమయంలో బీసీ బిల్లు గవర్నర్‌ దగ్గరకు ఎప్పుడు వెళ్లిందని ఏజీని ప్రశ్నించింది. బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్నపుడు జీవో ఎలా ఇచ్చారంది. దీనిపై ఏజీ వాదనలు వినిపించి అసెంబ్లీ తీర్మానం చేసిందని.. స్పీకర్ నిర్ణయం ఫైనల్ అని తెలిపారు. అయితే ఎన్నికలను వాయిదా వేసుకోవాలని సూచించింది హైకోర్టు. ప్రభుత్వ సమాధానానికి సమయం ఇస్తూ విచారణను వాయిదా వేసింది. ఇవాళ మరోసారి ఇదే అంశంపై విచారణ జరపనుంది హైకోర్టు.

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులతో చర్చించారు. మంగళవారం తన నివాసంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పీసీసీ చీఫ్ బీ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌లతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున హైకోర్టులో దీనికి అనుగుణంగా వాదనలు వినిపించాలని ప్రభుత్వం అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించింది. రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై ప్రభుత్వ వాదనలను సమర్ధవంతంగా వినిపించాలని సీఎం సూచించారు. ఈ పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్‌మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. ఈ విషయమై సింఘ్వితో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. తమిళనాడులో రిజర్వేషన్లు 69 శాతం అమలు కావడంతో పాటు రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాత బీసీలకు రిజర్వేషన్ల కోసం జీవో జారీ చేసిన అంశాలను ప్రభుత్వం హైకోర్టులో ప్రస్తావించనుంది ప్రభుత్వం.

హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నోటిఫికేషన్ రేపు విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే ఈ తీర్పును సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదంటే పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరే ఛాన్స్ ఉంది. ఎన్నికల నిర్వహణకు సమయం కోరి అప్పటివరకు న్యాయ చిక్కులు క్లియర్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories