Asifabad: ఆసిఫాబాద్ డీసీసీ పీఠం ఎంపికపై ఉత్కంఠ

Asifabad: ఆసిఫాబాద్ డీసీసీ పీఠం ఎంపికపై ఉత్కంఠ
x

Asifabad: ఆసిఫాబాద్ డీసీసీ పీఠం ఎంపికపై ఉత్కంఠ

Highlights

ఆసిఫాబాద్ డీసీసీ పీఠం ఎంపికపై ఉత్కంఠ పరిశీలకులుగా డా.నరేష్ కుమార్, శ్రీనివాస్‌గౌడ్, అనిల్, జ్యోతి జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో పర్యటన జిల్లా పీఠం కోసం 38 మంది దరఖాస్తు

ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఎవరికి దక్కనుంది..? ఆశావహుల దరఖాస్తులను స్వీకరించిన ఏఐసీసీ పరిశీలన బృందం.. వారి వ్యక్తిగత వివరాలు కూడా సేకరించింది. అంతేకాక ఫైనల్ జాబితా కూడా ఢిల్లీకి పంపనుండటంతో.. ఆ జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయన్న చర్చ జోరందుకుంది. పారదర్శకంగా ఎంపిక ఉంటుందని పరిశీలకులు చెబుతున్నా.. జిల్లాలోని గ్రూపు రాజకీయాలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఎవరికివారు ఢిల్లీ స్థాయిలోనూ పైరవీలు చేస్తున్నారట. అయితే పరిశీలకులను మెప్పించి.. వారు రూపొందించిన ఫైనల్ జాబితాలో మాత్రం తమ పేరు ఉందా..? లేదా..? అన్నసస్పెన్స్‌.. ఆశావహుల్లో నెలకొంది. ఇంతకీ కొత్తగా డీసీసీ పీఠం అధిరోహించేది ఎవరోనన్నది ఆసక్తికరంగా మారింది. చివరకు జిల్లాకు కొత్త అధ్యక్షుడు వస్తారా..? పాత అధ్యక్షుడే కొనసాగుతారా..? కొత్త వారే వస్తే పార్టీని నడిపే సత్తా ఉంటుందా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష ఎంపిక ప్రక్రియ.. ఆ పార్టీ వర్గీయుల్లో ఉత్కంఠకు తెరలేపింది. పార్టీ అధిష్టానం జిల్లా ఇన్చార్జిగా ఏఐసీసీ ప్రతినిధి నరేష్ కుమార్‌తోపాటు పిసిసి కోఆర్డినేటర్లు శ్రీనివాస్ గౌడ్, అనిల్ కుమార్, జ్యోతి ఈనెల 11 నుంచి జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో కార్యకర్తల అభిప్రాయాలతోపాటు నాయకుల సూచనలు.. అలాగే వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారి నుంచి ఒక్కొక్కరిని పిలుస్తూ వారి వివరాలు, పార్టీకి చేసిన సేవలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధ్యక్ష పదవికి 38 మంది దరఖాస్తు చేసుకోగా.. 28 మంది వ్యక్తిగతంగా కలిశారు. వారు పార్టీకి చేసిన సేవలు ఏఐసీసీ ప్రతినిధికి వివరించారు. వ్యక్తిగతంగా హాజరైన 28 మందిలో ఆరుగురిని ఎంపిక చేసి అధిష్టానానికి నివేదించనన్నారు పరిశీలకులు. 15 రోజుల్లో అధ్యక్షుడి పేరును ప్రకటిస్తామన్న ఢిల్లీ ప్రతినిధి వ్యాఖ్యలు జిల్లా కాంగ్రెస్ నాయకుల్లో నూతన ఉత్సాహం తీసుకొచ్చాయి.


ఆసిఫాబాద్‌ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 28 మంది ఏఐసీసీ ప్రతినిధిని కలిసినా అందులో ఆరుగురి పేర్ల జాబితా మాత్రమే పార్టీ హైకమాండ్‌కు చేరనుందట. ఆ ఆరుగురిని ఎంపిక చేసే పనిలో ఏఐసీసీ ప్రతినిధి నరేష్ కుమార్‌తోపాటు పిసిసి కోఆర్డినేటర్లు శ్రీనివాస్ గౌడ్, అనిల్ కుమార్, జ్యోతి బిజీబిజీగా ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న పేర్లతోపాటు ఎంపిక చేసే ఆరుగురు పేర్లు సైతం గోప్యంగా ఉంచడంతో ఎవరెవరు డీసీసీ రేసులో ఉన్నారా..? అన్న చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. షీల్డ్ కవర్లో తమ పేరే అధిష్టానానికి వెళ్తుందన్న ధీమాలో ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారట.


అధ్యక్ష పదవి రేసులో ప్రధానంగా తిర్యాణీ చెందిన అనిల్ గౌడ్, ఆసిఫాబాద్ చెందిన బాలేశ్వర్ గౌడ్, మసాదే చరణ్, వసంత్ కుమార్ రెబ్బెనకు చెందిన దుర్గం సోమయ్య, చెన్న సోమశేఖర్, జైనూర్ ఏఎంసీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ పేర్లు ప్రధానంగా ప్రచారంలో ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష ఎంపికను ప్రణాళిక బద్ధంగా చేపట్టిందట. జిల్లాలో 32 మంది దరఖాస్తు చేసుకోగా 28 మంది వ్యక్తిగత వివరాలను ఢిల్లీ ప్రతినిధికి అందజేశారు. దరఖాస్తుదారులను పలు ప్రశ్నలు వేస్తూ వివరాలు సేకరించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో జిల్లా అధ్యక్ష పదవిని పలువురు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్న గత పదేళ్లలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉన్నారు. అంతేకాక వారిలో మనోధైర్యాన్ని నింపుతూ భరోసాగా నిలిచారన్న టాక్ ఉంది. ప్రస్తుతం పాత అధ్యక్షులకు మళ్లీ జిల్లా బాధ్యతలు అప్పగించే ఆలోచన లేకపోవడంతోపాటు ఐదేళ్లకు పైగా పార్టీలో సేవలందించిన వారికే ప్రాధాన్యత ఉంటుందని హైకమాండ్ ఈపాటికే ప్రకటించింది. ఈ క్రమంలో పార్టీ జిల్లా అధ్యక్ష పగ్గాలు చేపట్టే ఆ నూతన నాయకుడెవరన్నది ఆసక్తిగా మారింది. ఆ కొత్త అధ్యక్షుడు.. అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ.. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ కేడర్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఎవరిని వరించనుందో..? చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories