Telangana Budget Session: బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం.. రూ.3.8 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌..?

Telangana Budget Session to Begin from March 12
x

Telangana Budget Session: బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం.. రూ.3.8 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌..?

Highlights

Telangana Budget 2025-26: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్దమైంది. ఈనెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఫ్లాన్ చేస్తుంది.

Telangana Budget 2025-26: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్దమైంది. ఈనెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఫ్లాన్ చేస్తుంది. 12న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. ఇక అదే రోజు బీఏసీ సమావేశం, అసెంబ్లీ పనిదినాలను ఖరారు చేస్తారు. 12న గవర్నర్ ప్రసంగంపై 13న సభ ధన్యవాదాలు తెలపనుంది. ఇక.. 14న హోలీ పండుగ, 15, 16 తేదీల్లో శని, ఆదివారాలు ఉన్నాయి. ఆ రోజుల్లో బడ్జెట్ నిర్వహణపై ఇంకా క్లారిటీ రాలేదు. 17, 18న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీ, ఎస్సీ రిజర్వేషన్లపై చట్టబద్దత కోసం బిల్లుపై చర్చ జరిపి ఆమోదిస్తారు. ఇక 19న రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీ లో ప్రవేశపెడతారు ఆర్థికమంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ నెల 29 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. మొత్తంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పదమూడు రోజులపాటు జరిగే అవకాశం ఉందని అంచనా.

ఈసారి బడ్జెట్ దాదాపు 3.8 లక్షల కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉంది. గతేడాది 2.91 లక్షల కోట్ల బడ్జెట్ ను అసెంబ్లీ లో ప్రవేశపెట్టారు. ఈసారి తెలంగాణ బడ్జెట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. ప్రధానంగా హైదరాబాదు కేంద్రంగా ప్యూచర్ సిటీ, మూసీ నది పునరుజ్జీవనం, మెట్రో విస్తరణ అంశాలతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై ప్రభుత్వం, మహిళలకు సంబంధించిన పథకాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. రైతు భరోసా, కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, క్వింటాల్ వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ తో పాటు సంక్షేమ పధకాలపై నిధుల కేటాయింపుపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. బడ్జెట్ నేపధ్యంలోనే సీఎం రేవంత్‌రెడ్డి అటు ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు వివిధ రకాల గ్రాంట్స్ పై ఇప్పటికే భట్టి విక్రమార్క ఎంపీలతో సమావేశం నిర్వహించారు.

ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా సిఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టిన అంశం ప్యూచర్ సిటీ. ఇప్పటికే ప్యూచర్ సిటీపై FCDA ప్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తామని క్యాబినెట్ లో ఆమోదించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఫ్యూచర్ సిటీ ఉండనుంది. ప్యూచర్ సిటీ అభివృద్ధి కోసం భారీగా నిధులు బడ్జెట్ లో కేటాయించే అవకాశం ఉందని సమాచారం. సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా అనేక సందర్భాలలో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని.. ఆ అప్పులకు మిత్తితో పాటు సంక్షేమ పధకాలు, ప్రభుత్వ జీతాలకు సుమారుగా 13వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర బడ్జెట్ కు అనుగుణంగా ఆదాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఐటి సెక్టార్ లో ఆదాయం తో పాటు కీలకమైన మైనింగ్ శాఖ లో ఆదాయంపై పలుమార్పులు చేసింది. మైనింగ్ పై అధిక ఆదాయం కోసం ప్రభుత్వం ఫ్లాన్ చేస్తోంది. ఈ శాఖలో ఎక్కడ అవినీతికి తావులేకుండా దృష్టి సారించింది.

ఇక రిజిస్ట్రేషన్ శాఖ పై దృష్టి సారించి ఎల్ ఆర్ఎస్ ను తీసుకువచ్చింది రేవంత్‌ సర్కార్. రాష్ట్రంలో భూముల క్రయ విక్రయాల నుంచి రాష్ట్ర ఖజానాకు ఆదాయం లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగానే హెచ్ఎండిఎ పరిధిని విస్తరించి.. అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ లపై ప్రధానంగా దృష్టి పెట్టింది. అటు ఎక్సైజ్ శాఖలో కూడా ఇప్పటికే బీర్ల ధరలు పెరగగా... ఎక్సైజ్ నుంచి ఆదాయం కోసం ప్రభుత్వం అచితూచీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే బడ్జెట్ రూపకల్పన కోసం ఆర్ధిక శాఖమంత్రి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్ని శాఖలతో ప్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి ఆయా శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు తెప్పించారు. రాష్ట్రంలో ప్రధాన రాబడులు, ఆదాయ మార్గాలు, సంక్షేమ పధకాల అమలుకు నిధులు... ఇలా ప్రతి శాఖ నుంచి భట్టి విక్రమార్క నివేదికలు తెప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ 3.8 లక్షల కోట్లు ఉంటుందని అంచనా.

ఈసారి బడ్జెట్‌లో రాష్ట్రాభివృద్ధితో పాటు సంక్షేమ పధకాలకు పెద్దపీట వేయనున్నట్టు సమాచారం. అలాగే.. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూడా బడ్జెట్ రూపకల్పన జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈసారి తెలంగాణ బడ్జెట్ రికార్డు స్థాయి బడ్జెట్ గా నిలిచే అవకాశం ఉందని ఓ అంచనా.

Show Full Article
Print Article
Next Story
More Stories