Student Health : నిమ్స్ లో వైద్యం.. ఖరీదైన ఇంజెక్షన్లు.. సర్కార్ బడి పిల్లల కోసం రేవంత్ రెడ్డి స్పెషల్ కేర్

Telangana Gurukul Health Command Center
x

Telangana Gurukul Health Command Center

Highlights

Student Health : తెలంగాణ ఎస్సీ గురుకుల విద్యార్థుల కోసం రేవంత్ సర్కార్ హెల్త్ కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసింది. 5 వేల మందికి చికిత్స అందిస్తూ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కార్పొరేట్ వైద్యం అందిస్తోంది.

Student Health : తెలంగాణలోని ఎస్సీ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థుల ఆరోగ్యానికి రేవంత్ రెడ్డి సర్కార్ పక్కా భరోసా కల్పిస్తోంది. హాస్టళ్లలో ఉంటూ చదువుకునే పిల్లలు అనారోగ్యం బారిన పడితే తల్లిదండ్రులు పడే ఆందోళన అంతా ఇంతా కాదు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హెల్త్ కమాండ్ కంట్రోల్ సెంటర్‎ను ఏర్పాటు చేసింది. గత డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ కేంద్రం, ఇప్పుడు గురుకుల విద్యార్థుల పాలిట సంజీవనిలా మారింది. 24 గంటల పాటు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ, అవసరమైన వారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తోంది.

టెలీకాన్ఫరెన్స్‌తో నిరంతర నిఘా

ఈ హెల్త్ కమాండ్ సెంటర్‌లో నిరంతరం ఇద్దరు నిపుణులైన డాక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు అందుబాటులో ఉంటారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ గురుకుల సొసైటీలతో డాక్టర్లు టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఎక్కడైనా ఏ విద్యార్థికైనా జ్వరం వచ్చినా, ఒంట్లో నలతగా ఉన్నా వెంటనే వివరాలు సేకరిస్తారు. దీనివల్ల వ్యాధి ముదరక ముందే చికిత్స ప్రారంభించే అవకాశం కలుగుతోంది. ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ వంటి ఘటనలు జరిగినప్పుడు వేగంగా స్పందించి ప్రాణాపాయం తప్పించేందుకు ఈ సెంటర్ కీలక పాత్ర పోషిస్తోంది.

మూడు నెలల్లో వేల మందికి చికిత్స

గడిచిన మూడు నెలల గణాంకాలను పరిశీలిస్తే ఈ కేంద్రం పనితీరు అర్థమవుతుంది. దాదాపు 4,879 మంది విద్యార్థులు సాధారణ జ్వరాలతో బాధపడుతున్నట్లు గుర్తించి, వారికి పాఠశాలల్లోనే మందులు అందించి నయం చేశారు. మరో 280 మందిని మెరుగైన పరీక్షల కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. సుమారు 197 మంది విద్యార్థులకు తీవ్రమైన, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లు ఈ సెంటర్ గుర్తించింది. వీరికి సాధారణ చికిత్స సరిపోదని భావించి, ప్రభుత్వం ప్రత్యేక ప్లాన్ రూపొందిస్తోంది. ఎంత ఖరీదైన వైద్యమైనా సరే ప్రభుత్వమే భరిస్తూ పిల్లలను కాపాడేందుకు సిద్ధమైంది.

ప్రాణాలు నిలబెడుతున్న హెల్త్ సెంటర్

ఈ హెల్త్ కమాండ్ సెంటర్ చొరవతో ఇప్పటికే పలువురు విద్యార్థుల ప్రాణాలు నిలబడ్డాయి. ఖమ్మం జిల్లా మధిర బాలికల గురుకులంలో భవనంపై నుంచి పడి వెన్నుముకకు తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థినిని, ఈ సెంటర్ సభ్యులు వెంటనే నిమ్స్ ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యం చేయించారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓ విద్యార్థికి అత్యంత ఖరీదైన ఇంజెక్షన్లు ఇప్పిస్తూ చికిత్స కొనసాగిస్తున్నారు. ఇలాంటి ముందస్తు చర్యల వల్ల గురుకులాల్లో మరణాల రేటు తగ్గుతుందని, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుందని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories