ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
x
Highlights

తెలంగాణ ప్రభుత్వం ప్రజా రవాణాకు, పర్యావరణానికి ప్రాధాన్యత నిస్తోంది. అందుకోసం 65 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ...

తెలంగాణ ప్రభుత్వం ప్రజా రవాణాకు, పర్యావరణానికి ప్రాధాన్యత నిస్తోంది. అందుకోసం 65 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ బస్సులు అత్యంత సౌకర్యవంతంగా ఉండడంతో పాటు మహాలక్ష్మి పథకం కింద ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఉన్న రూట్లతో పాటు నగరంలోని కొత్త కొత్త రూట్లలో ప్రయాణికుల కోసం బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు.

నగర రవాణా వ్యవస్థలో ఆర్టీసీ బస్సులు చాలా కీలకపాత్ర పోషిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా తక్కువ ధరకే ప్రయాణికుల అవసరాలను తీరుస్తుంది. అయితే ప్రస్తుతం బస్సులు సరిపోకపోవడంతో వాటిని పెంచే దిశగా రవాణా శాఖ మంత్రి దృష్టి సారించారు. ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా గ్రీన్ ఎనర్జీ బస్సులను ప్రోత్సహిస్తున్నారు. రాణిగంజ్ ఆర్టీసీ డిపో పరిధిలో 65 ఎలక్ట్రికల్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 2వేల 8వందల బస్సులు ఉన్నాయి. ఇందులో కాలం చెల్లిన బస్సుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో.. దశల వారీగా అన్ని బస్సులను గ్రీన్ ఎనర్జీ బస్సులుగా మార్చనున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 810 EV బస్సులను నడుపుతున్నారు. వీటిలో 300 బస్సులు జంట నగరాల్లో తిరుగుతున్నాయి. ఈరోజు 65 E-మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల ప్రవేశంతో పాటు, జనవరి చివరి నాటికి మరో 175 EV బస్సులు నగర రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి.

దీంతో జనవరి చివరినాటికి నగరంలో మొత్తం 540 EV బస్సులు అందుబాటులోకి ఉండనున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తూనే వాటి మౌలిక సదుపాయాల కోసం ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి పొన్నం తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో రియల్ టైమ్ ట్రాకింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ ITS ఉంటుంది. అగ్ని ప్రమాదాల గుర్తింపు, నిరోధక వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. 36 సీట్లతో సౌకర్యవంతమైన సీటింగ్ సామర్థ్యం ఉంటుంది. ప్రయాణీకుల సౌకర్యాలైన అనౌన్స్‌మెంట్ సిస్టమ్, రియల్-టైమ్ ట్రాకింగ్, డిజిటల్‌గా ప్రదర్శించబడిన గమ్యస్థాన బోర్డులు, USB ఛార్జింగ్, వృద్ధులు, వికలాంగుల కోసం ర్యాంప్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఈ 65 ఎలక్ట్రిక్ బస్సులలో సికింద్రాబాద్- కొండాపూర్ మధ్య 14 బస్సులు, సికింద్రాబాద్ - ఇస్నాపూర్ మధ్య 25 బస్సులు, సికింద్రాబాద్ - బోరబండ మధ్య 8 బస్సులు, సికింద్రాబాద్-రామాయంపేట మధ్య 6 బస్సులు, సికింద్రాబాద్-గచ్చిబౌలి మధ్య 8 బస్సులు, సికింద్రాబాద్-మీయాపూర్ ఎక్స్ రోడ్డు మధ్య 4 బస్సులు నడపనున్నారు. గ్రేటర్ పరిధిలోని 373 కొత్త కాలనీ రోడ్లకు ఆర్టీసీ బస్సులను ప్రారంభిస్తున్నట్టు మంత్రి పొన్నం తెలిపారు. దీనివల్ల దాదాపు 7 లక్షల మందికి ప్రజారవాణా మెరుగుపడుతుందని మంత్రి పొన్నం అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories