
ఒకే గ్రామానికి ఇద్దరు ఎమ్మెల్యేలు… ఇద్దరు ఎంపీలు… ఇది సినిమా కాదు… మన తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో జరుగుతున్న నిజ జీవితం!
ఒకే గ్రామానికి ఇద్దరు ఎమ్మెల్యేలు… ఇద్దరు ఎంపీలు… ఇది సినిమా కాదు… మన తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో జరుగుతున్న నిజ జీవితం! కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని 14 గ్రామాలు ఇప్పుడు మళ్లీ అందరి దృష్టికి వచ్చేశాయి. ఎందుకంటే… తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు దగ్గర పడ్డాయి!..
తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు .. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లోని 14 గ్రామాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి..తెలంగాణ లో జరగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ గ్రామాలు ప్రత్యేకంగా నిలిచాయి. కెరమెరి మండలంలోని ముకద్దంగూడ, కోట, అంతాపూర్, పరందోలి, గౌరీ, బోలాపటార్, లెండిగూడ, ఏసాపూర్, ఇంద్రానగర్, పద్మావతి, పాల్సగూడ, నారాయణగూడ, మహారాజ్‌గూడ, శంకర్‌లోధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండేవి. కానీ మహారాష్ట్ర రెవెన్యూ రికార్డుల్లో ఇవి ఇప్పటికీ చంద్రపూర్ జిల్లా జివతి మండలంలోనే ఉన్నాయి.
ఒకే వ్యక్తి… తెలంగాణలో ఓటు వేసి ఒక సర్పంచ్‌ను ఎన్నుకుంటాడు… మహారాష్ట్రలో ఓటు వేసి మరో సర్పంచ్‌ను ఎన్నుకుంటాడు..అంటే ఒకే గ్రామానికి ఇద్దరు సర్పంచ్‌లు ఉండబోతున్నారు ..రెండు ప్రభుత్వాలు పాలించడం తో ఈ గ్రామాలకి లాభాలతో పాటుగా నష్టాలుకూడా ఉన్నాయి. సంక్షేమ పథకాలు రెండు రాష్ట్రాల నుండి వస్తుండగా .. అభివృద్ధి మాత్రం రెండు రాష్ట్రాలు మరిచిపోతున్నాయి.తెలంగాణలో కల్యాణ లక్ష్మీ వస్తే… మహారాష్ట్రలో లాడ్లీ బెహ్నా వస్తుంది! రెండు చోట్ల పెన్షన్… రెండు చోట్ల ఉచిత కరెంట్… రెండు చోట్ల రేషన్ రైస్ వీరికి అందుతాయి. వేర్వేరు సమయాల్లో రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ బస్సులు ఈ గ్రామాల్లో తిరుగుతాయి. ఇక్కడి పాఠశాలల్లో మరాఠీ, తెలుగు మీడియంలో విద్యా బోధన జరుగుతోంది. రోడ్లు మహారాష్ట్ర వేయిస్తే.. తెలంగాణ కరెంట్ పోల్స్ వేసి విద్యుత్తు అందిస్తోంది.అభివృద్ధి కోరితే మాత్రం. .బడ్జెట్ లేదంటూ ఓ రాష్ట్రం .. కోర్టు లో ఉందని మరో రాష్ట్రం తప్పించుకుంటాయని స్థానికులు చెబుతున్నారు..ఎన్నికలు వచ్చాయంటేనే ఈ గ్రామాలు నాయకులకు గుర్తొస్తాయి… ఓట్లు పడ్డాక మళ్లీ మర్చిపోతారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
గ్రామాల సరిహద్దవు సమస్య పరిష్కారానికి సీకే నాయుడు కమిషన్‌ను ఏర్పాటు చేశాయి అప్పటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు. ఈ సమస్యను పరిశీలించిన సీకే నాయుడు కమిషన్.. అప్పటి ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా రిపోర్టు ఇచ్చింది. ఈ నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేసిన మహారాష్ట్ర.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో 1987లో మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ గ్రామాల కోసం కేసు వేసింది. ఈ గ్రామాలు మావే అంటూ మహరాష్ట్ర వేసిన కేసు 38 ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉంది. ఇంకా తీర్పు రాలేదు. కానీ ఈ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.. రెండు రాష్ట్రాలూ ఈ గ్రామాలను తమవే అనుకుని పరిపాలన చేయాలి! అని కోర్టు చెప్పడంతో నాటి నుండి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ గ్రామాలను పాలిస్తున్నాయి. అందుకే ఇక్కడి ప్రజలకు… రెండు ఓటర్ ఐడీలు… రెండు రేషన్ కార్డులు… కొందరికి రెండు ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి..
ఈ గ్రామాల్లోని ప్రజలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యారని తెలుస్తోంది. ముఖ్యంగా రైతు భరోసా, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యారు. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచే ఇలాంటి పథకాలకు ఇక్కడి ప్రజలు ఆకర్షితులయ్యారు. ఇక లంబాడాలు తదితర సామాజిక వర్గాలకు తెలంగాణలో షెడ్యూల్డ్ తెగల హోదా ఉంది. కానీ, మహారాష్ట్రలో వారికి ఆ హోదా లేదు. ఈ కారణాల వల్ల వాళ్లు తెలంగాణలోనే కొనసాగడానికి మొగ్గు చూపుతున్నారు.
సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ కేసు… ఎప్పుడు తీర్పు వస్తుందో తెలియదు. కానీ ఇక్కడి ప్రజలు మాత్రం రెండు రాష్ట్రాల నాయకులకి తమ ఓట్లతో తీర్పు ఇస్తున్నారు…ఇప్పుడు తెలంగాణ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మళ్లీ ఈ 14 గ్రామాల్లో ఓటర్లు రెండు రాష్ట్రాల భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. కానీ ఈ గ్రామాల భవిష్యత్తు ఏంటి ? తెలంగాణదా? మహారాష్ట్రదా? లేక ఇలాగే రెండింటికీ మధ్యలో ఉండిపోతుందా అనేది కోర్టు తీర్పు వరకు వేచి చూడాల్సిందే.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



