
తెలంగాణ రైతులకు అలర్ట్.. కేవలం సాగు భూములకే రైతు భరోసా.. సర్కార్ నయా రూల్!
Rythu Bharosa : తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు అన్ని భూములకు ఇస్తూ వచ్చిన ఈ సాయాన్ని, ఇకపై కేవలం నిజంగా సాగులో ఉన్న భూములకు మాత్రమే పరిమితం చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూముల గుర్తింపు ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో, ఈ మార్పులు త్వరలోనే అమల్లోకి రానున్నాయి.
సాగు భూములకే సాయం.. ఎందుకీ నిర్ణయం?
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని మరింత పారదర్శకంగా మార్చేందుకు కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సాగు చేయని భూములు, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ ప్లాట్లు, జాతీయ రహదారులకు కూడా రైతు బంధు (ప్రస్తుత రైతు భరోసా) నిధులు వెళ్లాయని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రజాధనం వృథా కాకుండా ఉండాలనే ఉద్దేశంతో, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సింథటిక్ ఎపర్చర్ రాడార్ శాటిలైట్ టెక్నాలజీతో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో రాష్ట్రంలోని సుమారు 1.53 కోట్ల ఎకరాల భూమిలో 20 లక్షల ఎకరాల్లో పంటలు వేయడం లేదని ప్రాథమికంగా తేలింది. దీంతో ఈ 20 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
మున్సిపల్ ఎన్నికల తర్వాతే నగదు జమ
రైతు భరోసా నిధుల విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఫిబ్రవరి 4న మిర్యాలగూడలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించారు. యాసంగి సీజన్ పెట్టుబడి సాయం కోసం సుమారు రూ.9,000 కోట్లు సిద్ధం చేసినట్లు సీఎం తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా నిధుల విడుదల ఆలస్యమవుతోందని, పోలింగ్ ప్రక్రియ ముగియగానే అర్హులైన 65 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.6,000 చొప్పున నేరుగా నగదు జమ అవుతుందని ఆయన హామీ ఇచ్చారు.
సర్వే వివరాలు, క్షేత్రస్థాయి పరిశీలన
శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు లేని భూములను గుర్తించినప్పటికీ, పొరపాట్లకు తావులేకుండా ఉండేందుకు ఏఈఓల ద్వారా క్షేత్రస్థాయి వెరిఫికేషన్ కూడా చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన భూములు, ఫామ్‌హౌస్‌లు, కొండలు వంటి వాటిని గుర్తించి జాబితా నుంచి తొలగిస్తున్నారు. కేవలం పంటలు పండించే అసలైన అన్నదాతలకే ఈ లబ్ధి చేకూరాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిబంధనల వల్ల ప్రభుత్వ ఖజానాకు కొన్ని కోట్లు ఆదా కావడంతో పాటు, అర్హులైన రైతులకు మేలు జరుగుతుందని అగ్రికల్చర్ అధికారులు చెబుతున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




