Weather Update : కోస్తాలో జల్లులు.. సీమలో సెగలు.. మధ్యాహ్నం 12 నుంచి 4 దాకా అప్రమత్తంగా ఉండాల్సిందే

Weather Update
x

Telangana Weather Update

Highlights

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రమవుతున్నాయి. హైదరాబాద్‌లో UV ఇండెక్స్ 9 గా నమోదు కాగా, రాయలసీమలో 39 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Weather Update : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మార్చి నెల రెండో వారంలోకి అడుగుపెట్టకముందే ఎండలు ముదురుతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటంతో మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో పొడి వాతావరణం కారణంగా వేడి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. నేడు (సోమవారం) వాతావరణ కేంద్రం విడుదల చేసిన అంచనాల ప్రకారం.. భాగ్యనగరంలో ఆకాశం నిర్మలంగా ఉండి గరిష్ట ఉష్ణోగ్రతలు 35°C వరకు చేరే అవకాశం ఉంది. గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో ఉక్కపోత కూడా తోడవుతోంది.

జిల్లాల్లో మండుతున్న ఎండలు

రాష్ట్రవ్యాప్త పరిస్థితి చూస్తే, ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లో ఎండ తీవ్రత రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా ఉంది. దక్షిణ తెలంగాణలో గాలుల దిశ మారడం వల్ల వేడి గాలులు వీస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, రాయలసీమ ప్రాంతం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఆదివారం కర్నూలులో 38.9°C, కడపలో 38.8°C ఉష్ణోగ్రతలు నమోదై రికార్డు సృష్టించాయి. అయితే, ఉత్తర కోస్తా ఆంధ్రలో మాత్రం ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై, తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

యూవీ ఇండెక్స్ డేంజర్ బెల్స్

హైదరాబాద్‌లో నేడు UV ఇండెక్స్ 9 గా నమోదైంది. ఇది అత్యధికం విభాగంలోకి వస్తుంది. దీనివల్ల సూర్యరశ్మి నేరుగా చర్మంపై పడితే అలర్జీలు, మంటలు వచ్చే ప్రమాదం ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు. వెళ్లాల్సి వస్తే గొడుగు, సన్ గ్లాసెస్ తప్పనిసరిగా వాడాలని, లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలని చెబుతున్నారు. దాహం వేయకపోయినా తరచుగా నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తీసుకోవడం వల్ల వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చని హెచ్చరిస్తున్నారు.

పొంచి ఉన్న వాయు కాలుష్యం

నగరంలో ఎండలతో పాటు వాయు కాలుష్యం కూడా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ మీడియంగా ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ, వేడి పెరగడం వల్ల గాలిలో దుమ్ము రేణువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బైక్ పై వెళ్లేవారు మాస్కులు ధరించడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. రానున్న మూడు నాలుగు రోజుల్లో ఎండలు మరో 2 డిగ్రీల వరకు పెరిగే ఛాన్స్ ఉందని, ప్రస్తుతానికి ఎలాంటి భారీ వర్ష సూచన లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రైతులు తమ కోతకు వచ్చిన పంటలను ఎండల నుంచి కాపాడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు అందుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories