తెలంగాణ అభివృద్ధిపై జర్మన్ బుండెస్టాగ్‌ కమిటీ చర్చ

తెలంగాణ అభివృద్ధిపై జర్మన్ బుండెస్టాగ్‌ కమిటీ చర్చ
x
Highlights

జర్మన్ బుండెస్టాగ్ అంతర్గత వ్యవహారాల కమిటీ చైర్మన్ జోసెఫ్ ఓస్టర్ నేతృత్వంలో జర్మనీలోని వివిధ రాజకీయ పక్షాలకు చెందిన పార్లమెంట్ సభ్యులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తెలంగాణ అభివృద్ధిపై చర్చ జరిగింది.

హైదరాబాద్: జర్మన్ బుండెస్టాగ్ అంతర్గత వ్యవహారాల కమిటీ చైర్మన్ జోసెఫ్ ఓస్టర్ నేతృత్వంలో జర్మనీలోని వివిధ రాజకీయ పక్షాలకు చెందిన పార్లమెంట్ సభ్యులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తెలంగాణ అభివృద్ధిపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎంఎల్‌సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు కూడా పాల్గొన్నారు. తెలంగాణ ప్రజాస్వామ్య పురోగతి, పాలనా దృక్పథం, అభివృద్ధికి దారితీసిన పరిస్థితులు అంతర్జాతీయంగా విశేష ఆసక్తిని రేకెత్తించిందని శ్రవణ్ దాసోజు తెలిపారు.

చర్చల్లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నాయకత్వంలో సాగిన చారిత్రాత్మక తెలంగాణ ఉద్యమాన్ని లోతుగా పరిశీలించారని శ్రవణ్ పేర్కొన్నారు. ఈ ఉద్యమం ఆత్మగౌరవం, సమగ్ర పాలన, సమతుల్య ఫెడరలిజం కోసం ప్రజల ఆకాంక్షలను వ్యక్తం చేసిన కీలక ప్రజాస్వామ్య ఉద్యమంగా అంతర్జాతీయ శాసనసభ్యులు గుర్తించారని ఆయన తెలిపారు. ప్రజల సంఘటిత ప్రజాస్వామ్య పోరాటం రాష్ట్ర అవతరణ తర్వాత సంస్థాగత సంస్కరణలుగా, ఆర్థిక పురోగతిగా ఎలా మారిందన్న అంశాన్ని వారు విశేషంగా మెచ్చుకున్నారని చెప్పారు.

ప్రజాస్వామ్యం, ఫెడరల్ వ్యవస్థలు, అంతర్గత పరిపాలన, న్యాయవ్యవస్థ స్వతంత్రత, పారిశ్రామిక అభివృద్ధి, రాజ్యాంగ సంస్థల పాత్ర వంటి అంశాలపై సారవంతమైన అభిప్రాయ మార్పిడి జరిగిందని డాక్టర్ దాసోజు తెలిపారు. ప్రజాస్వామ్య బాధ్యత, నియమావళిపై ఆధారపడిన పాలన పట్ల భారత్–జర్మనీ దేశాల మధ్య ఉన్న ఉమ్మడి నిబద్ధతను ఈ సంభాషణ ప్రతిబింబించిందన్నారు. బలమైన ఫెడరలిజం, సంస్థలపై ప్రజల నమ్మకం, ప్రజల ఆదేశానికి గౌరవం—ఇవే రాజకీయ స్థిరత్వానికి, సమగ్ర అభివృద్ధికి పునాదులు అని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్ నగరంలోని సమ్మిళిత సంస్కృతి, ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంతో ఉన్న అనుసంధానం కూడా ఈ చర్చల్లో ప్రాధాన్యంగా ప్రస్తావించినట్లుపేర్కొన్నారు. అలాగే, భారత్–జర్మనీ మధ్య విస్తరిస్తున్న సహకార అవకాశాలపై కూడా చర్చ జరిగిందని తెలిపారు. ఇలాంటి పరస్పర సంభాషణలు సాధారణ దౌత్య సంబంధాలకు మించి ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య సూత్రాలపై ఆధారపడి సాగించే నిరంతర పార్లమెంటరీ సంభాషణలు అత్యంత అవసరమని దాసోజు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories