Mallu Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..రూ.1 కోటికి పైగా బీమా..!!

Mallu Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..రూ.1 కోటికి పైగా బీమా..!!
x
Highlights

Mallu Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..రూ.1 కోటికి పైగా బీమా..!!

Mallu Bhatti Vikramarka: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి సందర్భంగా శుభవార్త వినిపించింది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రూ.1.02 కోట్ల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 5.14 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కలగనుంది. ఉద్యోగి అనుకోని ప్రమాదానికి గురైన సందర్భంలో, అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేందుకు ఈ బీమా ఉపయోగపడనుంది.

ఇప్పటికే సింగరేణి కాలరీస్ కంపెనీ ఉద్యోగులు, అలాగే ట్రాన్స్‌కో, జెన్‌కో వంటి విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి కోటి రూపాయలకు పైగా ప్రమాద బీమా సదుపాయం అమలులో ఉంది. సింగరేణిలో దాదాపు 38 వేల మంది ఉద్యోగులు, విద్యుత్ సంస్థల్లో 71 వేల మందికి పైగా సిబ్బంది ఈ బీమా పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు కూడా ఈ సౌకర్యాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రమాద బీమా అమలుకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఇటీవల ప్రముఖ బ్యాంకర్లతో విస్తృతంగా చర్చలు జరిపారు. బీమా కవరేజ్, నిబంధనలు, అమలు విధానంపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించేందుకు ఈ సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో కీలక పాత్ర పోషించే ఉద్యోగులు కూడా ప్రభుత్వ కుటుంబ సభ్యులేనని వ్యాఖ్యానించారు.

ఈ ప్రమాద బీమా పథకం ద్వారా ఉద్యోగుల్లో భద్రతా భావన మరింత పెరుగుతుందని, కుటుంబాలకు ధైర్యం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories