TS Municipal Elections 2026 : తెలంగాణలో మున్సిపల్ వార్ షురూ..నేటి నుంచే నామినేషన్ల పర్వం

TS Municipal Elections 2026 : తెలంగాణలో మున్సిపల్ వార్ షురూ..నేటి నుంచే నామినేషన్ల పర్వం
x
Highlights

తెలంగాణలో మున్సిపల్ వార్ షురూ..నేటి నుంచే నామినేషన్ల పర్వం

TS Municipal Elections 2026 : తెలంగాణలో మున్సిపల్ సమరానికి సైరన్ మోగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి ముగియకముందే, ఇప్పుడు పట్టణాల్లో పుర పోరు మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో బుధవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కోడ్ అమల్లోకి రావడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి పరాకాష్టకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ రోజు (జనవరి 28) ఉదయం నుంచే ఆయా కార్యాలయాల్లో నామినేషన్లను స్వీకరిస్తున్నారు. జనవరి 30వ తేదీ సాయంత్రం వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. ఫిబ్రవరి 3న విత్ డ్రా గడువు ముగియగానే, బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాపై స్పష్టత వస్తుంది. ఫిబ్రవరి 11న ఓటర్లు తమ తీర్పును వెలువరించనుండగా, 13న ఫలితాలు రానున్నాయి. మేయర్లు, ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియ ఫిబ్రవరి 16న పరోక్ష పద్ధతిలో జరగనుంది.

ఈ ఎన్నికల్లో మొత్తం 2,996 వార్డులకు గాను సుమారు 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య (26.80 లక్షలు) పురుషుల (25.62 లక్షలు) కంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఎన్నికల సంఘం మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పట్టణ ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు ఇప్పటికే మేనిఫెస్టోలను సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు, మంచినీటి సరఫరా, రోడ్ల వంటి స్థానిక అంశాలే అజెండాగా ఈ ఎన్నికలు సాగనున్నాయి.

అభ్యర్థుల ఎంపికలో ఈసారి అధికారులు కొత్త నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. ఎవరైనా నామినేషన్ వేయాలంటే సదరు అభ్యర్థి తన పేరిట ఉన్న మున్సిపల్ ఆస్తి పన్ను బకాయిలను పూర్తిగా చెల్లించి ఉండాలి. బకాయిలు ఉన్నట్లు తేలితే నామినేషన్ తిరస్కరించే అవకాశం ఉండటంతో, అభ్యర్థులంతా పన్నులు కట్టడానికి మున్సిపల్ కార్యాలయాల ముందు క్యూ కడుతున్నారు. అలాగే, రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం గతంలోనే స్పష్టత ఇచ్చింది. మొత్తం స్థానాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ కోటాలను జనాభా ప్రాతిపదికన కేటాయించారు.

రాజకీయంగా చూస్తే అధికార కాంగ్రెస్ పార్టీ ఇటీవలి సర్పంచ్ ఎన్నికల జోరును పట్టణాల్లోనూ కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు, కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే, పట్టణ ప్రాంతాల్లో తమకు ఉన్న పట్టును నిరూపించుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్ వంటి ప్రధాన పట్టణాల్లో హోరాహోరీ పోటీ తప్పేలా లేదు. ఫిబ్రవరి 16 నాటికి రాష్ట్రంలోని మున్సిపల్ పాలకవర్గాలకు కొత్త సారథులు రానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories