Telangana Congress: పెద్దన్న పాత్రలో సుదర్శన్ రెడ్డి

Telangana Congress: పెద్దన్న పాత్రలో సుదర్శన్ రెడ్డి
x

Telangana Congress: పెద్దన్న పాత్రలో సుదర్శన్ రెడ్డి

Highlights

మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు లభించని చోటు ఇందూరులో 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్‌కు 4 స్థానాలు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి 4వ సారి విజయం నిజామాబాద్ రూరల్ నుండి డాక్టర్ భూపతి రెడ్డి, ఎల్లారెడ్డి నుండి మదన్ మోహన్ రావ్

అయన మంత్రి కాదు.. కానీ మంత్రివర్గ సమావేశానికి హాజరవుతారు. అమాత్య హోదా లేకపోయినా అన్ని సౌకర్యాలు దక్కేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయన సీనియార్టికి ఆ పదవి తక్కువే అయినా ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హోదా దక్కించుకున్నారు. కేబినెట్ వ్యవహారాలకు అవకాశం కల్పించారు. ఇంతకు ఎవరా నాయకుడు..? రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హోదాలో కేబినెట్ సమావేశంకు వెళ్లే నేత ఎవరు..? వాచ్ దిస్ స్టోరీ.


తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏర్పడిన కేబినెట్‌లో,, ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చోటు లభించలేదు. ఇందూరు జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4 స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. అందులో బోధన్ నుండి మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి 4వ సారి అసెంబ్లీకి విజయం సాధించారు. నిజామాబాద్ రూరల్ నుండి డాక్టర్ భూపతి రెడ్డి, ఎల్లారెడ్డి నుండి మదన్ మోహన్ రావ్, జుక్కల్ నుంచి లక్ష్మి కాంత్ రావ్‌లు గెలుపొందారు. ఐతే జిల్లా నుంచి మంత్రివర్గం రేసులో పార్టీ సీనియర్ నేత, వివాదారహితుడు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ముందు వరుసలో నిలిచారు. కానీ సామాజిక సమీకరణాల లెక్కలు కుదరకపోవడంతో.. కాంగ్రెస్ పార్టీ మొండిచెయ్యే ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నిజామాబాద్‌ జిల్లాకు కేబినెట్‌లో ప్రాతినిథ్యం లేకుండా పోయింది. దీంతో జిల్లా కాంగ్రెస్ నేతలు..కేడర్‌ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఇందూరుపై హస్తం అధిష్టానం నిర్లక్ష్యం చూపిందనే విమర్శలు సైతం వచ్చాయి. కానీ లెక్కల్ని.. ప్రభుత్వ సలహాదారు పదవి,, కేబినెట్ హోదాతో సమం చేసే ప్రయత్నం చేసింది రేవంత్ నాయకత్వం. సుదర్శన్ రెడ్డి సీనియార్టీని గుర్తిస్తూ.. పార్టీకి ఆయన చేసిన సేవలకు గాను కేబినెట్ హోదాతో సలహాదారుగా అరుదైన గౌరవం కల్పిచింది.


1989లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలోకి వచ్చిన సుదర్శన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మొదటిసారి ఓటమి పాలయ్యాడు. ఐనా పట్టు వదలకుండా..

ప్రజాక్షేత్రంలోనే ఉంటూ 1999లో జరిగిన ఎన్నికల్లో బోధన్ ఎమ్మెల్యేగా.. టిడిపి అభ్యర్థి కె రమాకాంత్ పై గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ 2004, 2009 ఎన్నికల్లోనూ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా బోధన్‌లో రికార్డు నెలకొల్పాడు సుదర్శన్ రెడ్డి. 2009లో వై.యస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య, భారీ నీటిపారుదలశాఖ మంత్రిగా పనిచేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 & 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కాగా, 2023లో బోధన్ ఎమ్మెల్యేగా 4వ సారి విజయం సాధించారు. పీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో పీసీసీ కోశాధికారిగా సుదర్శన్ రెడ్డి సమర్థవంతంగా బాద్యతలు నిర్వహించడం జరిగింది. గత లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ లోక్‌సభ ఇన్‌చార్జ్‌గా బాధ్యత నిర్వహించారు. పార్టీలో చురుకైనా నేతగా, వివాదరహితునిగా సుదర్శన్ రెడ్డికి గుర్తింపు ఉంది.


మంత్రి పదవి దక్కకపోయినా.. దానికి సమానంగా ఆయన సీనియార్టినీ గౌరవిస్తూ కేబినెట్ ర్యాంక్‌ను కట్టబెట్టారు సీఎం రేవంత్. ప్రభుత్వం ఏర్పాటు నుంచి అమాత్యయోగాన్ని ఆకాంక్షించిన సుదర్శన్‌ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవితో కాంగ్రెస్‌ పార్టీ పదవిని కట్టబెట్టింది. సుదర్శన్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాల్లో అనేక సందర్భాల్లో పెద్దన్న పాత్రను పోషించారు. ఉభయ జిల్లాల్లో కలియ తిరుగుతూ కలెక్టర్లకు సలహాలు, సూచనలు అందించారు. మంత్రి హోదా లేకున్నా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హోదాలో మంత్రిగా భాధ్యతలు నిర్వహించబోతున్నారు. సీఎం అధ్యక్షతన జరిగే అన్ని క్యాబినెట్‌ మీటింగ్‌లకు ప్రత్యేక ఆహ్వానితుడిగా వెళ్లే అవకాశం ఒక్క సుదర్శన్ రెడ్డికే దక్కింది. పేరుకు ప్రభుత్వ సలహాదారు పదవి అయినప్పటికీ సుదర్శన్‌ రెడ్డికి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించారు. అన్ని శాఖలపై పట్టు సాధించేలా, నియంత్రణ చేసే విధంగా ప్రభుత్వ సలహాదారు పదవిని కట్ట బెట్టారు.


ఆరు గ్యారంటీల అమలు బాధ్యతను పర్యవేక్షించడంతో పాటుగా సంక్షేమ, అభివృద్ధి పనులపై అన్ని శాఖల్లో స్వీయ సమీక్షలు చేసే విధంగా సుదర్శన్ రెడ్డికి అధికారాలు అప్పగించారు. క్యాబినెట్‌ మంత్రితో సమానంగా వసతి, భద్రత, ఇతర సౌకర్యాలను కల్పిస్తూ జీవోను ఇచ్చారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రుల ఛాంబర్లకు పక్కనే ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మంత్రుల నివాస సముదాయంలో ప్రత్యేకంగా వసతి సౌకర్యాన్ని అందించేలా ప్రభుత్వం ఉత్తర్వులు కావడంతో సుదర్శన్ రెడ్డి అనుచరుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇటీవల నిజామాబాద్ లో సుదర్శన్ రెడ్డికి భారీ ర్యాలీతో సన్మాన సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన సుదర్శన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లాకు

సుదర్శన్ రెడ్డే మంత్రి, ఆయనే సర్వస్వం అని స్పష్టం చేశారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సుదర్శన్ రెడ్డి పెద్ద దిక్కుగా మారాడు. జిల్లాకు మంత్రి పదవి లేకపోవడంతో సుదర్శన్ రెడ్డి మంత్రి కానీ మంత్రిగా భాధ్యతలను నిర్వహించనున్నారు. తొలి రెండేళ్లు ఎలాంటి పదవి లేకపోవడంతో.. సుదర్శన్ రెడ్డి వర్గం కొంత అసమ్మతికి లోనైంది. కానీ ఇప్పుడు కేబినెట్ హోదా కట్టబెట్టడంతో.. జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో, సుదర్శన్ రెడ్డి అనుచరుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories