Komatireddy Rajgopal Reddy : రాజగోపాల్‌కు మంత్రి పదవి ఖాయమా..?

Komatireddy Rajgopal Reddy : రాజగోపాల్‌కు మంత్రి పదవి ఖాయమా..?
x

Komatireddy Rajgopal Reddy : రాజగోపాల్‌కు మంత్రి పదవి ఖాయమా..?

Highlights

తెలంగాణ కాంగ్రెస్ తాజా రాజకీయాలు ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయట.

తెలంగాణ కాంగ్రెస్ తాజా రాజకీయాలు ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయట. మంత్రి పదవి కోసం ఆయన చేస్తున్న పోరాటం, అధిష్టానం వైఖరి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను మరోసారి వేడెక్కించాయట. మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న ఈ అంశం మళ్లీ హాట్‌టాపిక్‌గా మారడానికి కారణాలు లేకపోలేదు. తాజాగా క్రికెటర్ అజారుద్దీన్‌కు కేబినెట్ హోదా దక్కడం, వెంటనే ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ప్రేమ్‌సాగర్ రావుకు కూడా కేబినెట్ హోదా కలిగిన నామినేటెడ్ పదవులు దక్కాయి. దీంతో రాజగోపాల్ రెడ్డికి పదవి ఖాయమేనా అనే చర్చ ఊపందుకుంది. కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆ రెండు మంత్రి పదవుల్లో ఒకటి రాజగోపాల్ రెడ్డికి ఖాయమైనట్టేనా..? కాంగ్రెస్ హైకమాండ్ మనసులో ఏముంది..?

తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో గతంలో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉండేవి. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనూహ్య సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి వరించింది. దీంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న మంత్రి పదవుల సంఖ్య రెండుకు తగ్గింది. ​అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రెండు ఖాళీలను కూడా త్వరలోనే భర్తీ చేయాలన్న పట్టుదలతో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన వెంటనే పూర్తి స్థాయి కేబినెట్‌ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. మిగిలిన రెండు స్థానాల్లో కొత్తగా ఇద్దరికి కేబినెట్‌లో అవకాశం దక్కే అవకాశం ఉంది. సుదర్శన్ రెడ్డి, ప్రేమసాగర్ రావు వంటి సీనియర్లకు నామినేటెడ్ పోస్టులు కేటాయించి, కేబినెట్‌లోకి "ఫైర్ బ్రాండ్స్"ను తీసుకురావాలని చూస్తున్నారట. జూబ్లీ హిల్స్ బైపోల్ ఫలితాలు వెల్లడైన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది..


గతంలో రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించేందుకు అధిష్టానం వివిధ ప్రయత్నాలు చేసింది. కేబినెట్ ర్యాంకుతో కూడిన ఆరు గ్యారెంటీల అమలు కమిటీ చైర్మన్‌, డిప్యూటీ స్పీకర్ పదవి వంటివి ఆఫర్ చేసింది. అయినా "మంత్రి పదవి తప్ప మరే పదవీ వద్దు" అని తెగేసి చెప్పారట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆ పట్టుదలే ఆయనకు పదవి దక్కకుండా చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


అజారుద్దీన్‌కు కేబినెట్ హోదా పదవి ఇవ్వడంతో మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న రెండు బెర్త్‌లలో ఒకటి బీసీ వర్గానికి, మరొకటి ఓసీ వర్గానికి కేటాయించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ​సుదర్శన్ రెడ్డికి కేబినెట్ హోదా దక్కడంతో, ఓసీ కోటాలో ఇప్పుడు ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి పేరుతోపాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్‌రెడ్డి రంగారెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ​నల్గొండ జిల్లా రాజకీయ సమీకరణాలు, పోరాట చరిత్రను దృష్టిలో ఉంచుకుని, మిగిలిన రెండు బెర్త్‌లలో ఒకటి రాజగోపాల్ రెడ్డికి ఖాయమవుతుందని ఆయన అనుచరులు బలంగా నమ్ముతున్నారు.


ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ.. మంత్రి పదవి దక్కకపోవడంతో గతంలో చాలా దూకుడుగా, అగ్రెసివ్‌గా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి శైలిలో ఇటీవల మార్పు కనిపిస్తోందన్న టాక్ ఉంది. అజారుద్దీన్‌కు మంత్రి పదవి కేటాయించిన తర్వాత చౌటుప్పల్‌లో మీడియాతో మాట్లాడినప్పుడు రాజగోపాల్ చాలా సంయమనంతో స్పందించారట.​"అధిష్టానం ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి పనిచేస్తాను. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా పనిచేస్తా. నేను పార్టీ మారుతున్నానని వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు. ఏదైనా ఉంటే నేనే మీడియా ముందుకు వచ్చి చెప్తాను" అని రాజగోపాల్ రెడ్డి కూల్‌గా స్పష్టం చేశారు.


పైగా సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావుకు కేబినెట్ హోదా దక్కడం పట్ల రాజగోపాల్ చాలా సంతోషంగా ఉన్నారట. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలోనే ఆయన ఢిల్లీ పెద్దలను కలవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారన్న టాక్ వినిపిస్తోంది. అధిష్టానం ఇచ్చిన హామీని నెరవేర్చుకుని, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తుందా..? ఎప్పటిలాగే "హ్యాండ్" ఇస్తుందా..? మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories