‘సేఫ్ హైదరాబాద్’ లక్ష్యంతో ‘జీరో డిలే’ విధానం

‘సేఫ్ హైదరాబాద్’ లక్ష్యంతో ‘జీరో డిలే’ విధానం
x
Highlights

హైదరాబాద్ మహానగర పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ విషయంలో పోలీస్‌ స్టేషన్ల పరిధులు, కమిషనరేట్ల సరిహద్దులు అడ్డుకాకూడదని నగర సీపీ వీసీ సజ్జనర్ అన్నారు.

హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ విషయంలో పోలీస్‌ స్టేషన్ల పరిధులు, కమిషనరేట్ల సరిహద్దులు అడ్డుకాకూడదని నగర సీపీ వీసీ సజ్జనర్ అన్నారు. బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు, నేరం జరిగిన వెంటనే స్పందించేందుకు ‘జీరో డిలే’ విధానాన్ని క్షేత్రస్థాయిలో మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఆయన చెప్పారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా బుధవారం మూడు కమిషనరేట్ల కీలక సమన్వయ సమావేశం జరిగింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి, రాచకొండ సీపీ సుధీర్‌బాబు పాల్గొన్నారు. నగర భద్రత, ట్రాఫిక్ సమస్యలు, నేరస్థుల కదలికలపై సుదీర్ఘంగా చర్చించారు.

సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో నేరస్తులు ఒక కమిషనరేట్ పరిధిలో నేరం చేసి, మరో కమిషనరేట్ పరిధిలోకి వెళ్తున్నారని ఉన్నతాధికారుల దృష్టికి క్షేత్రస్థాయి అధికారులు తీసుకువచ్చారు. పరిధుల పేరుతో పోలీసులు కాలయాపన చేయడం వల్ల నేరస్తులు తప్పించుకునే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కింది స్థాయి సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూడాలని నగర సీపీ సజ్జనర్ అన్నారు. నేరం ఎక్కడ జరిగినా, ఏ కమిషనరేట్ పరిధి అన్నది చూడకుండా సమీపంలోని పోలీసులు వెంటనే స్పందించాలన్నారు.

రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై మూడు కమిషనరేట్ల పోలీసులు ఉమ్మడి నిఘా ఉంచాలని, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలన్నారు. రౌడీ షీటర్లు, నేరస్థులు తరచుగా తమ నివాసాలను మారుస్తున్నారని, వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా పక్కా సమాచార మార్పిడి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.

నేరాలతో పాటు నగరంలో ట్రాఫిక్ నిర్వహణపైనా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. నగరంలోకి వచ్చే భారీ వాహనాల 'నో ఎంట్రీ' సమయాలను ఒకేలా అమలు చేయాలని, ముఖ్యంగా పీక్ అవర్స్‌లో ఈ వాహనాలు రోడ్లపైకి రాకుండా, నగరం వెలుపలే నిలువరించాలని అన్నారు.

వారాంతాల్లో మందుబాబులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తప్పించుకోకుండా, మూడు కమిషనరేట్ల పరిధిలో ఏకకాలంలో ఉమ్మడి తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వాహనదారుల పెండింగ్ చలానాల వసూలు కోసం మూడు కమిషనరేట్ల పరిధిలో ఏకకాలంలో 'స్పెషల్ డ్రైవ్'లు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

సరిహద్దు జంక్షన్ల వద్ద సిగ్నల్ టైమింగ్స్ విషయంలో రెండు కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీసులు రియల్ టైమ్ గా సమన్వయంతో పనిచేయాలని, దీనివల్ల వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సుల వల్ల ట్రాఫిక్ సమస్యలు జటిలమవుతున్నాయని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సమన్వయంతో అడుగులు వేయాలన్నారు.

‘‘నేరస్తులకు సరిహద్దులు ఉండనప్పుడు, పోలీసులకు కూడా ఉండకూడదు. బాధితులకు తక్షణ న్యాయం అందించే ‘జీరో డిలే’ విధానమే మనకు ముఖ్యం. మూడు కమిషనరేట్లు వేరైనా మన లక్ష్యం 'సేఫ్ హైదరాబాద్' ఒక్కటే. సాంకేతికతను వినియోగించుకుంటూ మూడు కమిషనరేట్ల పోలీసులు ‘సింగిల్ ఫోర్స్’లా పనిచేస్తేనే నేరాలను పూర్తిగా అరికట్టగలం. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఎక్కడ దాక్కున్నా వదిలే ప్రసక్తే లేదు,’’ అని నగర సీపీ వీసీ సజ్జనర్‌ హెచ్చరించారు.

సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ.. హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తోందని, ముఖ్యంగా ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ, నేరాల కట్టడికి మూడు కమిషనరేట్ల సమన్వయం అత్యవసరమని అన్నారు. అధునాతన సాంకేతికతను, సీసీటీవీ నెట్‌వర్క్‌ను అనుసంధానించడం ద్వారా నేరస్తుల కదలికలను రియల్ టైమ్‌లో పసిగట్టవచ్చని అన్నారు.

రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్ మహానగరంలో నేరాల నియంత్రణకు జాయింట్ టీమ్స్ ని ఏర్పాటు చేసి.. మూడు కమిషనరేట్లు సమన్వయంతో పని చేయాలన్నారు. పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచడంలోనూ, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలోనూ సమాచార మార్పిడి కీలకమని గుర్తు చేశారు.

ఈ సమావేశంలో అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు, జాయింట్‌ సీపీలు తఫ్సీర్‌ ఇక్బాల్‌, జోయల్‌ డెవిస్‌, గజరావు భూపాల్‌ తో పాటు మూడు కమిషనరేట్లకు చెందిన డీసీపీలు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories