Adilabad: భారీ ట్రాఫిక్ జామ్.. 10 కి.మీ మేర నిలిచిన వాహనాలు!
Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, నేరేడిగొండ మండలాల మధ్య కుప్టి బ్రిడ్జి వద్ద లారీ, సిమెంట్ ట్యాంకర్ ఢీకొనడంతో 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచింది.
Adilabad: భారీ ట్రాఫిక్ జామ్.. 10 కి.మీ మేర నిలిచిన వాహనాలు!
Adilabad: ఇచ్చోడ, నేరేడిగొండ మండలాల పరిధిలోని 44వ నంబరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నేరేడిగొండ మండలం కుప్టి బ్రిడ్జిపై నిన్న అర్ధరాత్రి టమాటా లోడ్‌తో వెళ్తున్న లారీ, సిమెంట్ మిక్సర్ ట్యాంకర్ ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి.
ఇప్పటికే ఆ బ్రిడ్జి ఒక వైపు భారీ గుంత పడటంతో రాకపోకలను నిలిపివేసి, రెండో వైపు వన్ వే ద్వారా మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. అయితే అదే వన్ వే బ్రిడ్జిపై ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో రహదారి పూర్తిగా దిగ్బంధమైంది. దీంతో ఇరువైపులా సుమారు పది కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సమాచారం అందుకున్న అధికారులు క్రేన్ల సాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం వాహనాల కదలికలు ప్రారంభమైనప్పటికీ, వన్ వే కావడంతో ట్రాఫిక్ అత్యంత నెమ్మదిగా సాగుతోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ముందస్తు చర్యగా ఇచ్చోడ మండల కేంద్రంలోనే ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. అలాగే నేరేడిగొండ మండలం రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద భారీ వాహనాలను ఆపుతూ, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు.




