Gudihatnoor: బతికున్న వృద్ధురాలిని రికార్డుల్లో శవంగా మార్చిన అధికారులు

Gudihatnoor: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో అధికారుల నిర్లక్ష్యంతో బతికున్న 76 ఏళ్ల వృద్ధురాలిని రికార్డుల్లో మృతి చెందినట్లు చూపించి పింఛన్ నిలిపివేశారు.

NAGULA SATISH, BOATH
Published on: 27 Aug 2026 8:11 PM IST
Gudihatnoor
X

Gudihatnoor: బతికున్న వృద్ధురాలిని రికార్డుల్లో శవంగా మార్చిన అధికారులు

గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం పరాకాష్టకు చేరింది. కళ్లముందే నిలుచుని మొరపెట్టుకుంటున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం, నిండు జీవితాన్ని కాగితాల్లో చంపేసింది. బతికుండగానే ఒక వృద్ధురాలిని రికార్డుల్లో శవంగా మార్చేసి, ఆమెకు అందాల్సిన పింఛన్‌ను నిలిపివేసిన అమానవీయ ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో వెలుగుచూసింది.

గుడిహత్నూర్ మండలం ​డోంగ్రగావ్ గ్రామానికి చెందిన 76 ఏళ్ల వృద్ధురాలు పసారే లక్ష్మీబాయికి భర్త మరణించిన తర్వాత 2014 నుంచి ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్ అందుతోంది. అయితే, 2024లో ఆమె అనారోగ్యం బారిన పడటంతో వరుసగా మూడు నెలల పాటు పింఛన్ తీసుకోలేకపోయారు. దీంతో నిబంధనల ప్రకారం ఆమె పింఛన్ తాత్కాలికంగా నిలిచిపోయింది. అనారోగ్యం నుండి కోలుకున్న వెంటనే ఆమె స్థానిక గ్రామ పంచాయతీ అధికారులను కలిసి తన పరిస్థితిని వివరించగా, సమస్యను పరిష్కరించి పింఛన్ మళ్లీ వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు.

​ఆ మాటలను నమ్మి రెండు సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన ఆ వృద్ధురాలికి ఇటీవల దిమ్మతిరిగే నిజం తెలిసింది. అధికారిక రికార్డుల్లో ఆమె 2024లోనే మరణించినట్లు నమోదు చేసి పింఛన్‌ను శాశ్వతంగా రద్దు చేశారని తెలిసి లక్ష్మీబాయి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. గ్రామ పంచాయతీ బాధ్యులు క్షేత్రస్థాయిలో విచారణ జరపకుండా, సదరు మహిళ బతికే ఉందా లేదా అనే ప్రాథమిక విషయాన్ని కూడా నిర్ధారించుకోకుండా ఇష్టారాజ్యంగా ఇచ్చిన నివేదికే ఈ తప్పిదానికి కారణమని స్పష్టమవుతోంది.

​ఈ విషయమై గుడిహత్నూర్ ఎంపీడీవోను వివరణ కోరగా, ఇటీవల బాధితురాలి సమస్య తమ దృష్టికి వచ్చిందని, గ్రీవెన్స్‌లో దరఖాస్తు స్వీకరించి ఉన్నతాధికారులకు పంపించామని తెలిపారు. 2024లో డోంగ్రగావ్ పంచాయతీ ఇచ్చిన తప్పుడు నివేదిక ఆధారంగానే పెన్షన్ పోర్టల్‌లో ఆమె మరణించినట్లు నమోదై ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రాణం ఉన్న మనిషిని రికార్డుల్లో చంపేసి రెండేళ్లుగా మానసిక క్షోభకు గురిచేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిలిచిపోయిన రెండు సంవత్సరాల బకాయిలతో సహా తన పింఛన్‌ను వెంటనే పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్‌కు లక్ష్మీబాయి కన్నీటితో విజ్ఞప్తి చేస్తున్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story