Adilabad: ఆదిలాబాద్‌లో ఉద్రిక్తత.. ఎస్పీ తీరును నిరసిస్తూ నిలిచిపోయిన గణేశ్ నిమజ్జన శోభాయాత్ర!

Adilabad: ఆదిలాబాద్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్ వైఖరిని నిరసిస్తూ గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర నిలిచిపోయింది. కలెక్టర్ హామీతో ఆందోళన విరమించారు.

Arun Chilukuri
Published on: 26 Sept 2026 11:14 AM IST
Adilabad: ఆదిలాబాద్‌లో ఉద్రిక్తత.. ఎస్పీ తీరును నిరసిస్తూ నిలిచిపోయిన గణేశ్ నిమజ్జన శోభాయాత్ర!
X

Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వ్యవహారశైలిని నిరసిస్తూ ఆదిలాబాద్ పట్టణంలో వేకువజాము నుంచే గణేశ్ నిమజ్జన శోభాయాత్ర నిలిచిపోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండప నిర్వాహకులు విగ్రహ వాహనాలను రోడ్డుపైనే నిలిపివేసి, స్థానిక అంబేడ్కర్‌ చౌక్‌లో బైఠాయించి ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ తనయుడు శరత్ ఆధ్వర్యంలో ఈ నిరసన కొనసాగింది.

రాత్రి సమయంలో అశోక్ రోడ్డు మార్గంలో విద్యుత్ దీపాలు ఆర్పివేసి నిర్వాహకులను పోలీసులు బెదిరించారని, ట్రాక్టర్ డ్రైవర్ల ఫోన్లు లాక్కుని కొందరి డీజేలను స్వాధీనం చేసుకున్నారని ఆందోళనకారులు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఎస్పీ స్వయంగా వచ్చి కొబ్బరికాయ కొట్టి నిమజ్జన శోభాయాత్రను మళ్లీ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎమ్మెల్యే పాయల్ శంకర్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, అదనపు ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీ జీవన్ రెడ్డి ఆందోళనకారులను సముదాయించేందుకు ప్రయత్నించినా వారు వెనక్కి తగ్గులేదు. చివరికి కలెక్టర్ రాజర్శి షా ఘటనా స్థలానికి చేరుకుని.. శోభాయాత్రలో పోలీసుల పాత్రపై సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో నిర్వాహకులు ఆందోళన విరమించారు. దీంతో శోభాయాత్ర తిరిగి సజావుగా కొనసాగింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.