Gudihathnoor: కలెక్టరేట్లో మోడల్ స్కూల్ విద్యార్థినికి 2వ స్థానం!
Gudihathnoor: ఆదిలాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి స్పోకెన్ ఇంగ్లీష్ పోటీల్లో గుడిహత్నూర్ మోడల్ స్కూల్ 9వ తరగతి విద్యార్థిని షేక్ నిజ్బా ద్వితీయ స్థానం సాధించింది.
Gudihathnoor: కలెక్టరేట్లో మోడల్ స్కూల్ విద్యార్థినికి 2వ స్థానం!
గుడిహత్నూర్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక చొరవతో స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా యాభై పాఠశాలల్లో అమలవుతున్న ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో గుడిహత్నూర్ మోడల్ స్కూల్ విద్యార్థిని షేక్ నిజ్బా( 9th class) అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఎంపిక చేసిన పాఠశాలల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థుల మధ్య పోటి జరగగా గుడిహత్నూర్కు చెందిన షేక్ మహమూద్ కుమార్తె షేక్ నిజ్బా చక్కటి భాషా ప్రావీణ్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆంగ్లంలో ప్రసంగించి అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రతిభను జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్వయంగా ప్రశంసిస్తూ జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
ఈ వేదికపై ప్రతిభ చూపి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చిన షేక్ నిజ్బాను గుడిహత్నూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు శ్రీకాంత్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థినికి తర్ఫీదునిచ్చి జిల్లా స్థాయి పోటీలకు సన్నద్ధం చేసిన ఇంగ్లీష్ టీచర్ శ్రీకాంత్ కృషిని ప్రిన్సిపాల్ కొనియాడారు. విద్యార్థిని సాధించిన ఈ విజయం పట్ల పాఠశాల ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్థులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ నిజ్బాకు శుభాకాంక్షలు తెలిపారు.




