Adilabad: తప్పిపోయిన బాలుడిని కాపాడిన మావల పోలీసులు!
Adilabad: ఆదిలాబాద్‌లో మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన 11 ఏళ్ల బాలుడిని మావల పోలీసులు 3 గంటల్లోనే గుర్తించి తల్లి ఒడికి చేర్చారు. ఎస్పీ అఖిల్ మహాజన్ బృందాన్ని అభినందించారు.
Adilabad: తప్పిపోయిన బాలుడిని కాపాడిన మావల పోలీసులు!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని షాద్నగర్ ప్రాంతానికి చెందిన సమరిన్ బేగం అనే మహిళకు ఐదుగురు సంతానం. నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో 11 సంవత్సరాల వయస్సు కలిగిన కుమారుడు అందరికంటే పెద్దవాడు. అతను నాలుగో తరగతి చదువుతున్నాడు.
కాగా సోమవారం ఉదయం పని నిమిత్తం బాలుడి తల్లి బయటకు వెళ్లిన సమయంలో అక్కతో జరిగిన గొడవ కారణంగా బాలుడిని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
ఈ క్రమంలో షాద్నగర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న పోలీసు మీకోసం కార్యక్రమంలో బాధితురాలు మావల పోలీసు సిబ్బందికి ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన మావల సీఐ బి.డి. ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ విస్తృతంగా అన్వేషించారు. పోలీసుల సమన్వయంతో కూడిన త్వరిత చర్యల ఫలితంగా ఫిర్యాదు అందిన మూడు గంటల్లోనే బాలుడి ఆచూకీ గుర్తించి, క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
ఈ ఘటనలో మావల పోలీసు సిబ్బంది తక్షణ స్పందన, సమన్వయంతో చేపట్టిన గాలింపు చర్యలు, చాకచక్యంగా బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన తీరును జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా అభినందించారు.




