Neredigonda: నేరడిగొండ హత్య కేసు.. 48 గంటల్లోనే మర్డర్ మిస్టరీ ఛేదింపు
Neredigonda: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పరిధిలో ఎస్సీ యువకుడు సతీష్ హత్య కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు.
Neredigonda: నేరడిగొండ హత్య కేసు.. 48 గంటల్లోనే మర్డర్ మిస్టరీ ఛేదింపు
నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎస్సీ యువకుడి హత్య కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. పెద్దబుగ్గారం గ్రామానికి చెందిన నాతరి సతీష్ (23) జూన్ 17న కనిపించకుండా పోగా, జూన్ 19న కరాత్వాడ చెరువులో అతని మృతదేహం లభ్యమైంది.
ప్రేమ వ్యవహారంలో అడ్డుగా ఉన్నాడనే కక్షతో ప్రధాన నిందితుడు షేక్ సుమేర్ (A1) తన ఐదుగురు స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్ మీడియాకు వెల్లడించారు. మద్యం పార్టీ పేరుతో సతీష్‌ను చెరువు వద్దకు పిలిపించి, బలవంతంగా మద్యం తాగించి గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో తేలింది.
అనంతరం శవాన్ని చెరువులో పడేసి, సాక్ష్యాలను రూపుమాపేందుకు మృతుడి బైక్‌ను ఆదిలాబాద్‌కు, మొబైల్ ఫోన్‌ను రైలులో పడవేసినట్లు పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల సహాయంతో నిందితులైన షేక్ సుమేర్, గంగాధరి సాయి కృష్ణ, బొజ్జ విష్ణువర్ధన్, షేక్ అక్రమ్, అబ్దుల్ నెహెఫ్, సయ్యద్ నోమాన్లను అరెస్ట్ చేశారు.
వారి నుంచి 5 మొబైల్ ఫోన్లు, 3 బైక్‌లు, సంఘటనా స్థలంలో 7 ఖాళీ బీరు సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS)తో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.




