Adilabad: ఆదిలాబాద్‌ జిల్లాలో వర్షాలు రైతన్నల్లో హర్షం

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో అన్నదాతలకు ఊరట. కుంటాల, పొచ్చెర జలపాతాల్లో మళ్లీ మొదలైన నీటి ప్రవాహం, హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు.

NAGULA SATISH, BOATH
Published on: 21 July 2026 6:21 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌ జిల్లాలో వర్షాలు రైతన్నల్లో హర్షం

ఆదిలాబాద్‌: గత కొన్ని రోజులుగా వర్షాలు లేక దిగాలు పడ్డ ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి నిన్నటి నుండి కురుస్తున్న వానలతో కాస్త ఊరట లభించింది. సాధారణంగా జూన్ మాసంలోనే ఇక్కడి జలపాతాలు నీటితో నిండి పర్యాటకులను ఆకట్టుకుంటాయి అయితే జులై మాసం చివరికి వచ్చినా ఈసారి వర్షాలు లేక జలపాతాలు బోసి పోయి కనిపించాయి.

అటు ఏడాదంతా శ్రమించే అన్నదాతలు సైతం వానల కోసం ప్రత్యేక పూజలు చేస్తూ, 'కప్పతల్లి' ఆటలతో వరుణదేవుడిని వేడుకున్నారు, చివరికి వారి ప్రార్థనలు ఫలించి నిన్నటి నుంచి వర్షాలు ప్రారంభం కావడంతో పొలాల్లో పనులు మళ్ళీ మొదలవుతున్నాయి.

వర్షాలు ఇలాగే కొనసాగితే పంటలు గట్టెక్కుతాయని రైతులు భావిస్తున్నారు. ఈ వర్షాలతో జిల్లాలోని ప్రముఖ జలపాతాలైన కుంటాల, పొచ్చెర, కనకాయిలకు ఇప్పుడిప్పుడే ఎగువ నుంచి స్వల్పంగా నీరు వచ్చి చేరుతోంది. ఇన్నాళ్లూ నీళ్లు లేక వెలవెలబోయిన ఈ జలపాతాల్లో నిన్నటి వర్షాల వల్ల నీటి ప్రవాహం మెల్లగా మొదలైంది.

ఇకపై కూడా వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే ప్రాజెక్టులు, చెరువులతో పాటు జలపాతాలు నిండుగా పారే అవకాశం ఉంది. ఏది ఏమైనా, నిన్నటి నుంచి పడుతున్న వానలతో అటు రైతాంగంలో, ఇటు జిల్లా వ్యాప్తంగా వాతావరణంలో కాస్త ఉపశమనం లభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story