Adilabad RIMS: ఆదిలాబాద్ రిమ్స్‌లో ఘోర విషాదం.. ఏసీ పేలి ఇద్దరు నవజాత శిశువులు మృతి
Adilabad RIMS: తెలంగాణలోని ఆదిలాబాద్ ప్రభుత్వ రిమ్స్ (RIMS) ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఒక ఘోర ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
Adilabad RIMS tragedy
Adilabad RIMS: తెలంగాణలోని ఆదిలాబాద్ ప్రభుత్వ రిమ్స్ (RIMS) ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఒక ఘోర ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆసుపత్రిలోని స్పెషల్ కేర్ నియోనాటల్ యూనిట్ (NICU)లో అర్థరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఏసీ యూనిట్ పేలిపోవడంతో పెను ప్రమాదం సంభవించింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ పేలుడు ధాటికి ముక్కుపచ్చలారని ఇద్దరు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోవడం ఆసుపత్రి వర్గాలను, స్థానికులను కలచివేసింది. పుట్టిన కొన్ని రోజులకే పసికందులు మృత్యువాత పడటంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
వార్డు నిండా దట్టమైన పొగ
ఈ నియోనాటల్ యూనిట్‌లో కేవలం పుట్టిన వెంటనే అనారోగ్యంతో ఉన్నవారు, కామెర్లు, శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న పసికందులు, నెలలు నిండని శిశువులకు మాత్రమే చికిత్స అందిస్తుంటారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఎన్‌ఐసీయూ వార్డులో మొత్తం 27 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఏసీ ఒక్కసారిగా పేలడంతో వార్డు మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. ఊపిరాడక చిన్నారులు ఉక్కిరిబిక్కిరి కాగా, వెంటనే అప్రమత్తమైన సిబ్బంది డోర్ అద్దాలు పగులగొట్టి లోపలికి వెళ్లి చిన్నారులను రక్షించే ప్రయత్నం చేశారు. అయితే పొగను తీవ్రంగా పీల్చడం వల్ల ఇద్దరు చిన్నారుల పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు వైద్యులు తెలిపారు.
ప్రైవేట్ ఆసుపత్రులకు తరలింపు
ఈ ప్రమాదం జరిగిన వెంటనే భయంతో వణికిపోయిన రోగుల బంధువులు, పసికందులను రక్షించుకోవడానికి ఆసుపత్రి నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థంకాక తల్లులు కన్నీరుమున్నీరయ్యారు. ఓ నవజాత శిశువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొక చిన్నారిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. గాయపడిన మరియు అస్వస్థతకు గురైన మిగతా చిన్నారులను మెరుగైన వైద్యం కోసం సమీపంలోని నాలుగు వేర్వేరు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఉన్నతాధికారుల విచారణకు ఆదేశం
ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి భయానక ఘటన జరగడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రి నిర్వహణలో లోపాలు, నాణ్యత లేని ఎలక్ట్రికల్ పరికరాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు తక్షణమే పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు సమాచారం. పసికందుల ప్రాణాలతో చెలగాటమాడిన అధికారులపై, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ హృదయ విదారక ఘటన ఆదిలాబాద్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టింది.




