Adilabad: ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయండి.. విద్యార్థులకు ఎస్పీ పిలుపు!

Adilabad: అదిలాబాద్ జిల్లాలో పోలీసు సిబ్బంది పిల్లల ప్రతిభా పురస్కారం. విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్. త్వరలో కెరీర్ గైడెన్స్ సదస్సులు.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 26 May 2026 6:05 PM IST
Adilabad
X

Adilabad: ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయండి.. విద్యార్థులకు ఎస్పీ పిలుపు!

Adilabad: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి - జిల్లా ఎస్పీ అఖిల్ విద్యార్థులు చిన్నప్పటి నుండే ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని అదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో గత విద్యా సంవత్సరంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బంది పిల్లలు, వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 85 శాతం పైగా మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులకు, వారి కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఎస్పీ ప్రశంసాపత్రాలను అందజేసి, అభినందించారు. సమావేశంలో పాల్గొన్న విద్యార్థులు తాము భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్, డాక్టర్స్, ఇంజనీర్స్, ఏఐ టెక్నాలజీ, చార్టెడ్ అకౌంటెంట్, పైలట్ వంటి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకున్నామని జిల్లా ఎస్పీకి తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తల్లిదండ్రులు గర్వపడేలా ఉన్నత స్థాయికి ఎదిగి, వారి సంరక్షణ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజూ క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంతో పాటు జిల్లా పోలీసుల కీర్తి ప్రతిష్టలను మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా త్వరలోనే కెరీర్ గైడెన్స్ పై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి, వివిధ ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్య, పోటీ పరీక్షలపై నిపుణులతో శిక్షణ అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పరిపాలన పి మౌనిక ఐపీఎస్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story