Adilabad: సరిహద్దు గ్రామాల్లో భద్రత పెంపు.. వాలీబాల్ విజేతలకు బహుమతులు
Adilabad: సోనాల మండలం గుర్రాల తాండాలో జరిగిన ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పాల్గొని, 20 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు.
Adilabad: సరిహద్దు గ్రామాల్లో భద్రత పెంపు.. వాలీబాల్ విజేతలకు బహుమతులు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలం గుర్రాల తాండ గ్రామంలో శనివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై, గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 20 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో నేరాల నియంత్రణకు, భద్రతకు సీసీటీవీలు ఎంతో దోహదపడతాయని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.ముఖ్యంగా గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనపై ఎస్పీ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
గంజాయి సాగు చేసేవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేసేలా సంబంధిత శాఖలకు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, గంజాయి రహిత సమాజ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తూ 20 మంది వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. సరిహద్దు గ్రామమైనందున పశువుల దొంగతనాలు, అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనంతరం, మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌లో విజేతలుగా నిలిచిన జీడిపల్లి (ప్రథమ), బోథ్-A (ద్వితీయ), బోథ్-B (తృతీయ) జట్లకు ఎస్పీ నగదు బహుమతులు, ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, సీఐ డి. గురుస్వామి, ఎస్ఐ వి. పురుషోత్తం, స్థానిక సర్పంచులు, గ్రామ పెద్దలు మరియు సుమారు 500 మంది ప్రజలు పాల్గొన్నారు.




