Adilabad: గుడిహత్నూర్‌లో ధాబా నిర్వాహకులతో ఎస్పీ ప్రత్యేక సమావేశం!
Adilabad: గుడిహత్నూర్‌లో ధాబా యజమానులతో ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సమావేశం.
Adilabad: గుడిహత్నూర్‌లో ధాబా నిర్వాహకులతో ఎస్పీ ప్రత్యేక సమావేశం!
గుడిహత్నూర్: జాతీయ, అంతర్రాష్ట్ర రహదారులపై ఉన్న ధాబాలలో మద్యం సేవించినా, విక్రయాయించినా, అసాంఘిక కార్యకలాపాలు సాగినా కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. 'అరైవ్ అలైవ్' కార్యక్రమంలో భాగంగా గుడిహత్నూర్ మండల కేంద్రంలో ధాబా యజమానులు, నిర్వాహకులతో ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ధాబాల్లో మద్యం అమ్మడం, సేవించడంతో పాటు గంజాయి, మాదకద్రవ్యాల విక్రయాలు జరిగితే కేసులు నమోదు చేసి, ధాబాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ధాబాలకు వచ్చే లారీలు, వాహనాలను రోడ్లపై కాకుండా కేవలం కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే నిలిపేలా యజమానులే బాధ్యత వహించాలని ఆదేశించారు.
ప్రతి ధాబాలో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ధాబాల్లో అనుమానాస్పద వ్యక్తులు, నేరస్తులు లేదా ఆయుధాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉట్నూరు ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, డీఎస్పీ జీవన్ రెడ్డి, ఎస్సై నరేష్ కుమార్, గుడిహత్నూర్ ఎస్ఐ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




