Adilabad: ఆదిలాబాద్ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన

Adilabad: ఆదిలాబాద్‌లో విద్యార్థులకు ట్రాఫిక్ పార్క్ సందర్శన, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన. తల్లిదండ్రులను హెల్మెట్, సీట్‌బెల్ట్ వాడేలా ప్రోత్సహించాలని పిలుపు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 11 July 2026 7:11 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ట్రాఫిక్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం సుమారు 40 మంది ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మరియు ట్రాఫిక్ పార్క్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు, ట్రాఫిక్ క్రమశిక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ ప్రణయ్ కుమార్ విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ గుర్తులు, రోడ్డు దాటే విధానం, జీబ్రా క్రాసింగ్ వినియోగం, పాదచారుల భద్రత, హెల్మెట్, సీట్‌బెల్ట్ ప్రాముఖ్యత, మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా జరిగే ప్రమాదాలపై సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు.

ట్రాఫిక్ పార్కులో ఏర్పాటు చేసిన నమూనా రహదారులు, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు గుర్తులను ప్రత్యక్షంగా చూపిస్తూ వాటి వినియోగాన్ని వివరించారు. రోడ్డు భద్రతా నియమాలను చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ..

విద్యార్థులు తాము ట్రాఫిక్ నియమాలు పాటించడమే కాకుండా తమ తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా, కార్లలో ప్రయాణించే సమయంలో సీట్‌బెల్ట్ వినియోగించేలా ప్రోత్సహించాలని సూచించారు. చిన్నారులు ఇంటి నుంచే రోడ్డు భద్రతకు రాయబారులుగా మారితే ప్రమాదాల నివారణలో మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story