Gudihathnur: ఆదిలాబాద్ బిడ్డకు మహారాష్ట్రలో మహోన్నత ఆధ్యాత్మిక పీఠం!

Gudihathnur: గుడిహత్నూర్‌కు చెందిన సామాన్య రైతు బిడ్డ మహంత్ కృష్ణా మహారాజ్ శాస్త్రి మహారాష్ట్రలోని ప్రసిద్ధ భగవాన్‌గడ్ నాల్గవ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు.

NAGULA SATISH, BOATH
Published on: 21 Oct 2026 10:15 AM IST
Gudihathnur
X

Gudihathnur: ఆదిలాబాద్ బిడ్డకు మహారాష్ట్రలో మహోన్నత ఆధ్యాత్మిక పీఠం!

Gudihathnur: ​ఆధ్యాత్మిక సాధనకు ప్రాంతీయ సరిహద్దులు, భాషా బేధాలు అడ్డంకి కావని మరోసారి రుజువైంది. తెలంగాణ నేల అందించిన ఒక నిరాడంబర యువ సాధకుడు, మహారాష్ట్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వార్కరీ ధర్మ పీఠాలలో ఒకటైన శ్రీ క్షేత్ర భగవాన్‌గడ్ సంస్థానానికి సర్వోన్నత అధిపతిగా ఎదిగారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన మహంత్ కృష్ణా మహారాజ్ శాస్త్రి, భగవాన్‌గడ్ నాల్గవ మహంత్‌గా బాధ్యతలు చేపట్టి యావత్ తెలంగాణ ఖ్యాతిని జాతీయ స్థాయిలో సగర్వంగా నిలిపారు.

​వ్యవసాయ కుటుంబం నుంచి వార్కరీ ప్రస్థానం

​కృష్ణా మహారాజ్ గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. కష్టపడి వ్యవసాయం చేసుకునే జైయభాయ్ ఉద్దవ్ రావు, గిరిజా బాయి దంపతుల మూడవ సంతానమే ఈ కృష్ణా మహారాజ్. పల్లెటూరి వాతావరణంలో, మట్టి వాసనల నడుమ పెరిగినప్పటికీ, ఆయన అంతరంగంలో చిన్నతనం నుంచే దైవచింతన, భక్తి భావం బలంగా వేళ్లూనుకున్నాయి.

విఠలేశ్వరుని తత్త్వం, సంతుల బోధనల పట్ల తీవ్రమైన ఆకర్షణ పెంచుకున్న ఆయన, ప్రాపంచిక బంధాల కంటే ఆధ్యాత్మిక సాధనే మిన్న అని భావించారు. ఆ తపనతోనే సుమారు 17 సంవత్సరాల క్రితం ఆయన తన స్వగ్రామాన్ని విడిచి మహారాష్ట్రలోని చారిత్రాత్మక భగవాన్‌గడ్‌కు పయనమయ్యారు.

​భగవాన్‌గడ్‌లో కఠోర సాధన, వేద పఠనం

​అహల్యానగర్ - బీడ్ జిల్లాల సరిహద్దులోని భగవాన్‌గడ్ చేరిన కృష్ణా మహారాజ్, అక్కడి ‘శ్రీ జ్ఞానేశ్వరి విద్యాపీఠం’లో చేరి వార్కరీ సంప్రదాయంలో లోతైన వేద పఠనం ప్రారంభించారు. సంస్థాన మూడవ పీఠాధిపతి డాక్టర్ న్యాయాచార్య నామ్‌దేవ్ మహారాజ్ శాస్త్రి మార్గదర్శకత్వంలో దాదాపు పన్నెండేళ్లపాటు గురుకుల పద్ధతిలో కఠోర అధ్యయనం సాగించారు. సంస్కృతం, వేదాంతం, వార్కరీ సాహిత్య మూలస్తంభమైన సంత్ జ్ఞానేశ్వరి గ్రంథంపై సంపూర్ణ పట్టు సాధించడంతో పాటు, ఆధ్యాత్మిక విద్యతో సమాంతరంగా ఎం.ఏ. ఉన్నత విద్యను పూర్తి చేసి ‘శాస్త్రి’ పట్టా పొందారు.

​నిరంజన్ సంస్థాన్ సేవలు.. తిరుగులేని గుర్తింపు

​విద్యాభ్యాసం పూర్తయ్యాక, పాథర్డీ తాలూకా పరిధిలోని ఏక్‌నాథ్‌వాడి 'శ్రీ క్షేత్ర నిరంజన్ సంస్థాన్' మహంత్‌గా కృష్ణా మహారాజ్ బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యసన విముక్తి, గోరక్షణ, జ్ఞానేశ్వరి ప్రవచనాలు, మధురమైన కీర్తనల ద్వారా ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఆయన పాండిత్యం, నిష్కల్మష సాధన, క్రమశిక్షణను నిశితంగా గమనించిన గురువు నామ్‌దేవ్ మహారాజ్ శాస్త్రి, లక్షలాది మంది భక్తులు కొలిచే భగవాన్‌గడ్ సంస్థానానికి తదుపరి వారసుడిగా కృష్ణా మహారాజ్‌ను ఎంపిక చేశారు.

​చారిత్రాత్మక పీఠారోహణ

​శ్రీ క్షేత్ర భగవాన్‌గడ్ సంస్థాన అమృత మహోత్సవ వేడుకల సందర్భంగా వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వానాల నడుమ గురువు నామ్‌దేవ్ మహారాజ్ శాస్త్రి స్వయంగా కృష్ణా మహారాజ్‌కు తిలకం దిద్ది, గద్దె బాధ్యతలను అప్పగించారు. సంత్ భగవాన్‌బాబా, భీమ్‌సింహ్ మహారాజ్ చూపిన ధర్మ మార్గంలో నడుస్తూ, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి, సంత్ సాహిత్య ప్రచారానికి తన జీవితాన్ని అంకితం చేస్తానని పీఠారోహణ అనంతరం మహంత్ కృష్ణా మహారాజ్ ప్రతినబూనారు.

​మహారాష్ట్రలోని లక్షలాది మంది చెరకు కోత కార్మికులకు, గ్రామీణ సమాజానికి భగవాన్‌గడ్ అత్యున్నత ఆశాజ్యోతి. దివంగత నేత గోపీనాథ్ ముండే వంటి మహామహులు ప్రసంగించిన ఆ వేదికకు, నేడు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌కు చెందిన ఒక సామాన్య రైతు బిడ్డ సర్వోన్నత పీఠాధిపతి కావడం తెలంగాణకే గర్వకారణం. భాషలు వేరైనా భక్తి మార్గం ఒక్కటేనని చాటిన మహంత్ కృష్ణా మహారాజ్ జీవితం నేటి తరానికి నిదర్శనమైన స్ఫూర్తి.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH