Adilabad: ఆదివాసీలు అన్ని రంగాల్లో అగ్రభాగాన ఎదగాలి.. కుసుమ్ ఆలం పిలుపు
Adilabad: ఆదివాసీలు కేవలం హక్కుల కోసమే కాకుండా.. విద్యా, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అగ్రభాగాన నిలిచినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని అన్నారు.
Adilabad: ఆదివాసీలు అన్ని రంగాల్లో అగ్రభాగాన ఎదగాలి.. కుసుమ్ ఆలం పిలుపు
Adilabad: ఆదివాసీలు కేవలం హక్కుల కోసమే కాకుండా, రాజకీయంగా, విద్యాపరంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిచినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ శ్రీమతి కుసుమ్ ఆలం పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం వైజాపూర్ గ్రామంలో నిర్వహించిన ఆదివాసీ లీడర్షిప్ డెవలప్మెంట్ (ఆదివాసీ నాయకత్వ వికాస) కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన శ్రీమతి కుసుమ్ ఆలంకు గ్రామస్తులు, నాయకులు సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆదివాసీ యువత, నాయకులు తమలో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. మన హక్కులను మనం కాపాడుకోవాలంటే చట్టాలపై, రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. చదువు ఒక్కటే ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపుతుందని, విద్యావంతులైనప్పుడే సమాజంలో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కోగలరని స్పష్టం చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని కోరారు.
సమాజంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలంటే రాజకీయాల్లో కూడా ఆదివాసీల భాగస్వామ్యం ఎంతో కీలకమని, ఆ దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, గుడిహత్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొడసం దౌలత్ రావు, పార్టీ సీనియర్ నాయకులు భూపెల్లి శ్రీధర్, అంకతి రవీందర్, బాలాజీ పటేల్, ఆడే జైపాల్, మహేందర్ తదితరులతో పాటు స్థానిక ఆదివాసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, యువతీ యువకులు, మహిళలు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




