Kaghaznagar: కాగజ్‌నగర్‌లో ఘనంగా ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవం!
Kaghaznagar: కాగజ్‌నగర్‌లో ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Kaghaznagar: కాగజ్‌నగర్‌లో ఘనంగా ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవం!
Kaghaznagar: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తోందని ఏఐటీయూసీ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ విమర్శించారు. కార్మికులు ఎన్నో పోరాటాలు, త్యాగాల ద్వారా సాధించుకున్న హక్కులను నిర్వీర్యం చేసే విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని డిమాండ్ చేశారు.
శనివారం కాగజ్‌నగర్‌లోని ఎంఎల్‌ఎస్ గోదాంలో ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేందర్ యూనియన్ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. 1920లో ఆవిర్భవించిన ఏఐటీయూసీ దేశంలో కార్మిక ఉద్యమానికి బలమైన పునాది వేసిందని, సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం కూడా పోరాటం చేసిన తొలి కార్మిక సంఘమని గుర్తుచేశారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ ఎన్నో ఉద్యమాలు నిర్వహించిందని తెలిపారు.
కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే నాలుగు లేబర్ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, గతంలో అమల్లో ఉన్న 44 కార్మిక చట్టాలను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచి అమలు చేయాలని కోరారు. ఎనిమిది గంటల పని విధానాన్ని పకడ్బందీగా అమలు చేయడంతో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీపై ఉన్న పరిమితులను తొలగించాలని అన్నారు. కనీస పెన్షన్‌ను రూ.10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
సింగరేణికి కొత్త బొగ్గు బావులు కేటాయించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. ఎస్‌పీఎంలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, సివిల్ సప్లై హమాలీ కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని సూచించారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఆటో, హమాలీ తదితర అసంఘటిత రంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసి అమలు చేయాలని, గ్రామపంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు సత్యనారాయణ, కుమార్, సురేష్, రాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.




