Asifabad: హామీలు ఎక్కడ? అమలు ఎప్పుడు?: కాంగ్రెస్‌పై కోనేరు కోనప్ప ఫైర్
Asifabad: ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మండిపడ్డారు.
Asifabad: హామీలు ఎక్కడ? అమలు ఎప్పుడు?: కాంగ్రెస్‌పై కోనేరు కోనప్ప ఫైర్
కొమురం భీం: ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం బారేగూడ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పర్యటించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తీవ్రస్థాయిలో విమర్శించారు.
హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బెజ్జూరు మండలంలోని బారేగూడ గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ‘కాంగ్రెస్ బాకీ కార్డుల’ను పంపిణీ చేశారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో మాత్రం వెనుకడుగు వేస్తోందని కోనప్ప ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులకు రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000 పెన్షన్, రైతు భరోసా, రైతులకు రూ.500 బోనస్, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా, కల్యాణలక్ష్మి పథకం లో భాగంగా తులం బంగారం వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, ఎన్నికల హామీలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కోనప్ప అన్నారు. హామీల అమలు జరిగే వరకు ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు,సర్పంచ్ లు ,మాజీ ఎంపీటీసీ లు , మాజీ కో ఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు కోనేరు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




