Basar: బాసర ఆర్జీయూకేటీలో రెండవ రోజు కాంట్రాక్టు అధ్యాపకుల నిరసన!
Basar: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో కాంట్రాక్టు అధ్యాపకులు గురువారం రెండవ రోజు “మార్చ్ టు రెగ్యులరైజేషన్” ర్యాలీ నిర్వహించి యూజీసీ 7వ వేతన సవరణ కోరారు.
Basar: బాసర ఆర్జీయూకేటీలో రెండవ రోజు కాంట్రాక్టు అధ్యాపకుల నిరసన!
Basar: ఆర్జీయూకేటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన “మార్చ్ టు రెగ్యులరైజేషన్” కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అధ్యాపకులు ఏబీ-3 నుంచి విశ్వవిద్యాలయ ప్రధాన గేటు వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా ఆర్జీయూకేటీ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, ఆర్జీయూకేటీ స్థాపించిన నాటి నుంచి కాంట్రాక్టు అధ్యాపకులు విశ్వవిద్యాలయంలో సేవలందిస్తున్నారని తెలిపారు. దాదాపు 18 సంవత్సరాలుగా నిరంతరాయంగా విద్యాబోధనతో పాటు విశ్వవిద్యాలయంలోని వివిధ పరిపాలనా విభాగాల్లో కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
విశ్వవిద్యాలయ అభివృద్ధిలో కాంట్రాక్టు అధ్యాపకుల పాత్ర ఎంతో కీలకమైనదని, ఇన్నేళ్లుగా అంకితభావంతో పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత, తగిన వేతన ప్రయోజనాలు అందకపోవడం బాధాకరమని అన్నారు.
ప్రభుత్వం తమ దీర్ఘకాలిక సేవలను గుర్తించి వెంటనే రెగ్యులరైజేషన్ లేదా అబ్జార్ప్షన్ ప్రక్రియను ప్రారంభించాలని, కాంట్రాక్టు అధ్యాపకులకు UGC 7వ వేతన సవరణ సంఘం (7th PRC) ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్టు అధ్యాపకుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని, తమ హక్కులు సాధించే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ పావని, డాక్టర్ రమాదేవి, డాక్టర్ సాయి కృష్ణ, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ ఉపేందర్ రావు, డాక్టర్ శ్రీకాంత్, సతీష్ కుమార్, శ్రీకాంత్, భానుప్రియ, డాక్టర్ కాశన్న, డాక్టర్ రాములు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.




