Basara: అమ్మవారి సన్నిధిలో ఇంటి దొంగలు.. సీసీటీవీ కెమెరాల్లో చిక్కిన ఆలయ సిబ్బంది
Basara: నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రసాదం తయారీ కేంద్రానికి సంబంధించిన పెద్ద గోల్‌మాల్ వెలుగులోకి వచ్చింది.
Basara Temple
Basara: నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రసాదం తయారీ కేంద్రానికి సంబంధించిన పెద్ద గోల్‌మాల్ వెలుగులోకి వచ్చింది. ఆలయ ప్రాంగణంలోని ప్రసాదం తయారీ కోసం తెచ్చిన విలువైన సరుకులు మాయం కావడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తుల కోసం ఉద్దేశించిన ప్రసాదం వస్తువులను కొందరు సిబ్బంది దొంగిలించి బయట దుకాణాల్లో విక్రయించినట్లు ఆధారాలు లభించాయి. ఈ ఘోరానికి పాల్పడిన వారిపై ఆలయ యంత్రాంగం కఠిన చర్యలు ప్రారంభించింది.
ఇంటి దొంగల చేతివాటం
ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు పెద్ద ఎత్తున లడ్డూ, పులిహోర తయారీకి ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా 15వ తేదీ సాయంత్రమే ఆలయ స్టోర్ నుంచి ప్రసాదాల తయారీకి కావలసిన నెయ్యి, సరుకులను బయటకు తీసి సిద్ధంగా ఉంచారు. అయితే ఇదే సరైన సమయంగా భావించిన కొందరు ఆలయ 'ఇంటి దొంగలు' ఆ సరుకులలో కొన్నింటిని దొంగచాటుగా ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లి బయట వ్యక్తులకు అమ్మేశారు.
అడ్డంగా దొరికిపోయిన సిబ్బంది
ప్రసాదం సరుకుల దారిమళ్లింపు దృశ్యాలన్నీ ఆలయంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. వీటిని పరిశీలించిన ఆలయ టెక్నికల్ టీమ్ వెంటనే అప్రమత్తమై ఈ విషయాన్ని బాసర ఆలయ ఈవో అంజనాదేవి దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే విచారణ చేపట్టిన అధికారులు ఈ గోల్‌మాల్‌లో ఒక పర్మినెంట్ ఉద్యోగితో పాటు మరొక తాత్కాలిక ఉద్యోగి భాగస్వామ్యమై ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. దీనితో తాత్కాలిక ఉద్యోగిని సంబంధిత ఏజెన్సీకి సరెండర్ చేయగా, స్టోర్ ఇన్‌చార్జ్‌గా ఉన్న పర్మినెంట్ ఉద్యోగికి వివరణ కోరుతూ సీరియస్ నోటీసులు జారీ చేశారు.
శాఖాపరమైన విచారణ అలాగే ఈవో కీలక ప్రకటన
సిబ్బంది నుంచి పూర్తి స్థాయి వివరణ వచ్చిన తర్వాత వారిపై శాఖాపరమైన తీవ్ర చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో అంజనాదేవి స్పష్టం చేశారు. ఆ సమయానికి చాకచక్యంగా వ్యవహరించి చోరీని పసిగట్టిన టెక్నికల్ టీమ్ సభ్యులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ప్రసాదం సరుకుల అక్రమ విక్రయం ఇప్పుడే జరిగిందా లేక గతంలోనూ ఏమైనా ఇలాంటి దారిమళ్లింపులు జరిగాయా అనే కోణంలో సమగ్ర విచారణ జరిపిస్తామని ఈవో ప్రకటించారు.




